CM Revanth Plans to make Hyderabad a signal-free city: హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా నగర ప్రజలను ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండటంతో దానికి చెక్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆధునికీకరణ, పట్టణీకరణతో భవిష్యత్‌లో హైదరాబాద్ మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సెక్రటేరియట్‌లో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కమిటీ ఛైర్మన్ మాగుంట శ్రీనివాసులురెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలపై సమావేశంలో చర్చించారు.
Also read: https://teluguprabha.net/national-news/vck-party-in-tamilnadu-politics/
అండర్‌పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్..
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. అండర్‌పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవెల్ విధానాన్ని తీసుకురావాలి. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదు. మల్టీ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. పార్కింగ్ ఇబ్బందులు అధిగమించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. క్యూర్, ప్యూర్, రేర్‌గా అభివృద్ధిని మూడు భాగాలుగా విభజించుకున్నాం. ఔటర్ రింగురోడ్డు క్యూర్ ఏరియాను సర్వీస్ సెక్టార్‌గా గుర్తించాం. ఓఆర్‌ఆర్ బయట.. ట్రిపుల్‌ఆర్ లోపల ఉన్న ప్యూర్ ఏరియాను తయారీ రంగంగా.. ట్రిపుల్‌ఆర్ బయట ఉన్న రేర్ ఏరియాను అగ్రికల్చర్ సెక్టార్‌గా గుర్తించాం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్‌ప్లాన్‌ను ఇప్పటికే ఆవిష్కరించాం. హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.’’ అని ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం రేవంత్ వివరించారు.

