CM Revanth Reddy Hyderabad development : దేశానికి ఆర్థిక ఇంజిన్ లాంటి భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దిల్లీ లాంటి మహానగరాలతో పోలిస్తే.. నివాసానికి అత్యంత అనుకూలమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ నగరంలో ఏకంగా లక్ష ఇళ్లను నిర్మించి ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. ఒకవైపు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూనే.. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీ, బీఆర్ఎస్‌లపైన నిప్పులు చెరిగారు.
అభివృద్ధికి బాటలు.. సైబరాబాద్‌కు మహర్దశ : దేశంలోని దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ఆరు ప్రధాన నగరాలే దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విశ్లేషించారు. దేశ ఐటీ ఎగుమతుల్లో 16.77 శాతం వాటాతో భాగ్యనగరం అగ్రగామిగా దూసుకుపోతోందని గుర్తుచేశారు. ఈ పరిపాలనను మరింత సులభతరం చేసేందుకే, పాలనా సమన్వయం కోసమే మహా నగరపాలక సంస్థను (GHMC) మూడు కార్పొరేషన్లుగా విభజించినట్లు ఆయన కుండబద్దలు కొట్టారు. బుధవారం మియాపూర్ వేదికగా రూ.1674.74 కోట్ల వ్యయంతో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనం, మియాపూర్‌లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు ఆరు వరుసల ద్విముఖ పైవంతెన, శేరిలింగంపల్లి వద్ద ఆర్వోబీ (ROB) నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా.. గాజులరామారంలో వంద ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అత్యాధునిక ‘ఇంటర్నేషనల్ బస్ టెర్మినల్’ నిర్మించబోతున్నట్లు ప్రకటించి నగరవాసుల్లో సరికొత్త ఆశలు చిగురింపజేశారు.
పేదలకు లక్ష ఇళ్లు.. ఆర్టీసీకి లాభాల పంట : నగరంలో ఏళ్లుగా నివాసం ఉంటున్న నిరుపేదల కోసం బృహత్తర పథకాన్ని సీఎం ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో ఏ ప్రాంతం వారికి అక్కడే లక్ష ఇళ్లు కట్టించి ఇస్తామని స్పష్టం చేశారు. అన్యాక్రాంతమైన, కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను నిర్దాక్షిణ్యంగా స్వాధీనం చేసుకుని, వాటిని పేదల ఇళ్ల కోసమే వినియోగిస్తామన్నారు. ఇక మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం అద్భుత విజయాలు సాధించిందని, ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లించామని తెలిపారు. మహిళా సంఘాలకు వెయ్యి బస్సులు కొనిచ్చిన ఘనత తమదేనని, నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ సంస్థ.. కేవలం ఈ పథకం వల్లే తిరిగి లాభాల బాట పట్టిందని సగర్వంగా ప్రకటించారు.
దిల్లీకి దేబిరింపులు.. తెలంగాణకు శూన్యం: బీజేపీపై ఫైర్ : సభలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. వారు తెలంగాణకు తెచ్చిన ప్రయోజనం గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. “గుజరాత్‌కు గులాంలా ఎందుకు పనిచేస్తున్నారు? మీకు ఓట్లేసిన తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోరా?” అని సూటిగా ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కోసం కేంద్రం నుంచి నిధులు తేలేరు కానీ, విమర్శలు మాత్రం చేస్తారా అని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి ప్రాజెక్టులు, నిధులు అడిగితే.. సరిగ్గా మూడు రోజుల తర్వాత కిషన్ రెడ్డి దిల్లీ వెళ్లి వాటికి అడ్డుపుల్ల వేస్తున్నారు. కాంగ్రెస్‌కు, రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు” అని సీఎం ధ్వజమెత్తారు.
ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మాజీ సీఎం : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ పరోక్షంగా చురకలు అంటించారు. పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన వ్యక్తి ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉందని, అప్పుడు రాజకీయాలు మాట్లాడుకుందామని, ఈ రెండేళ్లు రాష్ట్రాభివృద్ధి కోసమే అందరం కలిసి పనిచేద్దామని హితవు పలికారు. ప్రధానిగా పన్నెండేళ్లలో మోదీ ఏం చేశారో, రెండేళ్లలో ముఖ్యమంత్రిగా తాను ఏం చేశానో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.

