Revanth Reddy in Delhi ChitChat: తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి.. రాబోయే పదిన్నరేళ్లు తానే సీఎంనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీ పర్యటనలో అగ్రనేతలతో భేటీ అనంతరం రేవంత్.. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుదిదశకు చేరుకుందన్నారు. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు 2029లో జరుగుతాయని.. అప్పుడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని సీఎం వెల్లడించారు.
సింగరేణిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజు చర్చ జరిపి అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాస్తవాలు చెప్పిన తర్వాత కిషన్ రెడ్డి తాను మాట్లాడినది తప్పని గ్రహించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయం ప్రకటిత గృహ దిగ్బంధంలో ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2018లో తెచ్చిన నిబంధనల మేరకు సింగరేణి టెండర్లు ఉన్నాయని.. అందుకు సంబంధించి ప్రతి డ్యాక్యుమెంట్ అసెంబ్లీలో పెడతామని రేవంత్ పేర్కొన్నారు. ఆరోపణలు తప్పని తెలితే కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్తారా..అంటూ ప్రశ్నించారు. సింగరేణి అప్పులు మా హయాంలో చేయలేదని.. సింగరేణికి కేసీఆరే బకాయిలే పెట్టారని ఆరోపించారు.
Also Read: https://teluguprabha.net/telangana/ex-mlc-kavitha-comments-on-cm-revanth-reddy/
‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు బుల్లెట్ రైలు వచ్చింది. హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ హబ్‌గా మారుస్తాం. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు ఫ్యూచర్ సిటీ, ఎయిర్ పోర్టు సమీపంలో 500 నుంచి 700 ఎకరాలు ఇవ్వాలి. ఎన్టీఆర్ జాతీయ నాయకుడు, అమీర్ పేటలో ఆయన విగ్రహాన్ని తప్పకుండా పెడతాం. ఎన్టీఆర్ జాతి ఆస్తి. ఆయన ఎవరో ఒకరి సొత్తు కాదు. ఆయన జాతీయ నాయకుడు.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని ప్రతిపాదిస్తున్నా. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కాంగ్రెస్ పార్టీనే’. అని రేవంత్ వెల్లడించారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై సీఎం స్పందించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు ఆధారాలు తగలబడ్డాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖను రాస్తే సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పగిస్తామని రేవంత్ పేర్కొన్నారు. త్వరలో నియోజక వర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చేలా చేస్తామని తెలిపారు. మార్చి 31 లోపు హైద్రాబాద్ మెట్రోను ప్రభుత్వం టేకోవర్ చేసే ప్రక్రియ పూర్తి చేస్తామని.. జూన్ 2 న ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామని రేవంత్ వివరించారు.
చిట్‌చాట్‌కి ముందుగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నేతలతో భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశంలో.. ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించనున్న “గాంధీ సరోవర్ ప్రాజెక్టు” (బాపు ఘాట్ వద్ద) శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని సీఎం ఆహ్వానించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రితో భేటీలో వరంగల్ విమానాశ్రయ పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. కొత్తగూడెం, పెద్దపల్లి ఎయిర్‌పోర్ట్‌లకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రైల్వే మంత్రితో భేటీ అయి కృష్ణా – వికారాబాద్ రైల్వే లైన్, రాష్ట్రంలోని ఇతర రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించారు.
అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, కేబినెట్ విస్తరణ గురించి చర్చించినట్లు సమాచారం.

