HomeTop StoriesCM Revanth Reddy: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి...

CM Revanth Reddy: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు

CM Revanth Reddy comments in Mahila Shakti sabha: ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలకు నిజమైన గుర్తింపు దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళాశక్తి పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో.. మహిళా స్వయం సహాయక సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్ల సున్నా వడ్డీ డబ్బులను ఎగ్గొట్టిందని ఆరోపించారు. మహిళలతో పెట్టుకున్న వాళ్లు ఎవరైనా అధికారంలో ఉంటారా? ఆడవాళ్ల శాపం తగలడం వల్లే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందని జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి రూ.10,500 కోట్లు చెల్లించాలమని సీఎం చెప్పుకొచ్చారు. సమాజంలో ఏ పనిలోనైనా ఆడవాళ్లే అందరికంటే ముందుంటున్నారని సీఎం కొనియాడారు. మన ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి వచ్చిందని పండగ చేసుకునే గొప్ప సంస్కృతి మనది అన్నారు. ప్రపంచానికి మహిళా శక్తి ఏంటో చూపించిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని.. ఆమెను స్ఫూర్తిగా తీసుకునే మేము పాలిస్తున్నామని గుర్తు చేశారు. అమెరికా లాంటి పెద్ద దేశంలోనే ఆడవాళ్లకు ఓటు హక్కు రావడానికి వందల ఏళ్లు పట్టిందని, కానీ, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత జవహర్‌లాల్ నెహ్రూదే అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

- Advertisement -

Also read: Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు ఊహించని షాక్‌.. రాజ్యసభ నామినేషన్‌ రిజెక్ట్‌.. కారణాలివేనా?

బీజేపీ ఒక్కసారైనా మహిళను అధ్యక్షురాలిని చేసిందా?

దేశానికి మొదటి మహిళా రాష్ట్రపతిని అందించిందన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీదేనని సీఎం స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “బీజేపీ వాళ్లు వాళ్ల పార్టీకి ఒక్కసారైనా ఒక మహిళను అధ్యక్షురాలిని చేశారా? బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటి ఐదేళ్ల పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మంత్రులుగా అవకాశం ఇచ్చాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది రాజీవ్ గాంధీ. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సోనియా గాంధీ 2013లోనే బిల్లు తెచ్చారు. ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆడపిల్లలు రూపాయి ఖర్చు లేకుండా పక్క ఊర్లకు వెళ్లి హ్యాపీగా చదువుకుంటున్నారు. ఫ్రీ బస్సు పథకం వల్లే చదువు మధ్యలో ఆపేసే ఆడపిల్లల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మన రాష్ట్ర మహిళలు అంబానీ, అదానీలకు పోటీగా పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ కేంద్రాలను నడుపుతున్నారు. త్వరలోనే మహిళా శక్తి భవనాలను కడతాం. హైటెక్ సిటీ పక్కన వెయ్యి కోట్ల విలువైన భూమిని మహిళా సంఘాలకే ఇచ్చాం. మన రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల మహిళల చేతుల్లోనే ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలను ఏ మహిళైనా కట్టుకుందా? కానీ, ఈ రోజు మా ప్రభుత్వం ఇచ్చిన చీరలు కట్టుకునే మహిళలందరూ ఈ సభకు వచ్చారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేవరకు నేను నిద్రపోను. 2034 వరకు మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపిస్తాం.” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News