CM Revanth Reddy political attack on KTR : రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు అరెస్టుల పర్వం, మరోవైపు సున్నితమైన అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బండి భగీరథ్ అరెస్టు వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
లొంగుబాటా? అరెస్టా?.. చట్టం తనపని తాను చేస్తుంది!
బండి భగీరథ్ వ్యవహారంలో పోలీసులు చట్టప్రకారం నడుచుకున్నారని, అది ముమ్మాటికీ అరెస్టేనని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. “అప్పగిస్తే ఇంట్లోనో, పోలీస్‌స్టేషన్‌లోనో అప్పగిస్తారు. రోడ్డు మధ్యలో అడ్డగించి కస్టడీలోకి తీసుకుంటే దాన్ని లొంగుబాటు అని ఎలా అంటారు?” అని ఆయన లాజిక్ తీశారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ ఒక జడ్జిలా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక దర్యాప్తు అధికారిలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు పటిష్టమైన చట్టాలు ఉన్నాయని, బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి చట్టబద్ధమైన ప్రక్రియను ప్రారంభించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కేటీఆర్ మనిషేనా? ఆ రాజకీయ శాడిజం ఏంటి?
మైనర్ బాలిక వ్యవహారాన్ని రాజకీయ చదరంగంలో పావుగా వాడుకోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కేటీఆర్ అసలు మనిషేనా? రాజకీయ స్వలాభం కోసం ఒక మైనర్ అమ్మాయి ఫొటోలు బయటకు ఇస్తారా? దీన్ని శాడిజం అనక ఏమంటారు?” అని సూటిగా నిలదీశారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేస్తూ.. గతంలో కేటీఆర్ బావమరిది డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు ఎలాగైతే నోటీసులు ఇచ్చామో, ఇప్పుడు బండి భగీరథ్‌కు కూడా నిబంధనల ప్రకారమే నోటీసులు ఇచ్చామని గుర్తు చేశారు. అమ్మాయి వయస్సును నిర్ధారించడానికి కేటీఆర్ ఎవరని, దానికి వైద్యపరమైన, చట్టబద్ధమైన ప్రక్రియ ఉంటుందని ఆయన చురకలంటించారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-comments-on-politburo-meeting/
సున్నితమైన సమస్య.. కేసీఆర్ మౌనం దేనికి సంకేతం? : ఏ కేసులో అయినా పోలీసులకు ఒక స్పష్టమైన ప్రొసీజర్ ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు. ఫిర్యాదు రాగానే కేసు ఫైల్ చేసి 24 గంటల్లోగా బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశామన్నారు. ఎంతో సున్నితమైన ఈ సమస్యను పోలీసులు అంతే సున్నితంగా, బాధ్యతాయుతంగా పరిష్కరించారని, ప్రభుత్వ చర్యల్లో ఎక్కడా లోపం లేదని తేల్చి చెప్పారు. కేటీఆర్, బండి సంజయ్ మధ్య ఏదో వ్యక్తిగత పంచాయతీ ఉన్నట్లు కనిపిస్తోందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇంకా ‘కల్వకుంట్ల రాజ్యాంగమే’ నడుస్తోందని కేటీఆర్ భ్రమ పడుతున్నారని ఎత్తిపొడిచారు. ఇంత జరుగుతున్నా, ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని, ఆయనకు సామాజిక బాధ్యత లేదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

