HomeTop StoriesCM Revanth Reddy: కేసీఆర్‌.. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్‌ కాదా?.. విగ్రహావిష్కరణ సభలో...

CM Revanth Reddy: కేసీఆర్‌.. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్‌ కాదా?.. విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్‌ సూటి ప్రశ్న

CM Revanth Reddy Comments on NTR: ఎన్‌టీఆర్‌ దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడని, తెలుగుజాతికి స్ఫూర్తిని నింపిన మహనీయుడని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. “దేశ చరిత్రను తిరగరాసి సమాజానికి దిశా నిర్దేశం చేసిన స్ఫూర్తిదాయక నేతలు ముగ్గురే ముగ్గురు.. వారే అసలైన జాతిరత్నాలు అంటూ అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ పేర్లను ఆయన ప్రస్తావించారు. అమీర్‌పేట్‌ మైత్రివనం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. “మా ప్రజా ప్రభుత్వానికి ఇందిరమ్మ ఎంత ముఖ్యమో, ఎన్‌టీఆర్‌ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఆశయాల కలయికే మా ప్రస్తుత ప్రజా పాలన. ఆనాడు పేదల ఆకలి తీర్చడానికి, వారికి ఆత్మగౌరవం ఇవ్వడానికి ఎన్టీఆర్ మొదలు పెట్టిన పక్కా ఇళ్ల పథకమే.. ఈ నాడు మేము అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రతి అడుగులోనూ తమ పాలనలో కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్స్ కల్పించాలని ఆనాడు రాజీవ్ గాంధీ నిర్ణయం తీసుకుంటే.. దాన్ని మొట్టమొదటగా అమలు చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్.” అని సీఎం కొనియాడారు.

- Advertisement -

Also Read: Raidurgam: ఒకప్పుడు రాళ్లూ రప్పలు.. ఇప్పుడు కాసుల వర్షం.. రాయదుర్గంలో రూ. 237 కోట్లు పలికిన ఎకరం ధర..!

ఆ విషయంలో ఎన్ని విమర్శలు చేసినా భయపడను..

“కాంగ్రెస్‌ సీఎం, పీసీసీ చీఫ్‌.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కులమతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా దేశం గర్వించదగిన నాయకుడు ఎన్టీఆర్. అందుకే ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌ నడిబొడ్డులో ఆవిష్కరించుకున్నాం. నాకు జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా భయపడను. ఆనాడు ఇందిరాగాంధీ.. తెలంగాణ ప్రాంతం నుంచి పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, వెంకటస్వామి లాంటి నేతలను అందించారు. ఎన్టీఆర్‌.. తెలంగాణ ప్రాంతానికి తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కడియం శ్రీహరి, దేవేందర్‌గౌడ్‌, మోత్కుపల్లి లాంటి నాయకులను అందించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? ఎన్టీఆర్‌ నీడన బతికిన మీరు ఆయన్ను తక్కువ చేసి మాట్లాడటం సమంజసమా? ఎన్టీఆర్‌ లేకుండానే నాయకులయ్యారా? ఆయన ఆశీర్వాదంతోనే పాలకులయ్యారు. గ్రామాల్లో పటేల్‌ పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్‌ రద్దు చేసి పేదలకు విముక్తి కల్పించారు. ఆయన పేరు పెట్టుకున్న కొందరు నకిలీలు కూడా రాజకీయాల్లో ఉన్నారు’’ అని రేవంత్‌ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇక, మైత్రీవనం వంటి రద్దీ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలకు, తెలుగు జాతికి గర్వించదగ్గ విషయమని సీఎం పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News