హైదరాబాద్ (తెలుగుప్రభ) : తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి.. అక్కడ జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి హాజరుకానున్నారు. సమావేశం అనంతరం గురువారం యూకే పర్యటనకు బయలుదేరనున్నారు. బ్రిటన్ పర్యటన ముగించుకొని అమెరికాకు వెళ్లనున్నారు. 20 నుంచి 30వ తేదీ వరకు జరిగే పర్యటనలో భాగంగా సీఎం.. ఇరు దేశాల్లోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు, నూతన పెట్టుబడి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించి.. తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. కొత్త పెట్టుబడులను రాష్ట్రానికి ఆహ్వానించడంతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించనున్నారు.
అమెరికాలో సీఎం షెడ్యూల్ : సీఎం రేవంత్‌రెడ్డి 20న ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరనున్నారు. 21న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌ను సందర్శిస్తారు. అదే రోజు ఎమిరేట్స్ స్టేడియంలో ఈపీఎల్ ఫుట్‌బాల్ ప్రెజెంటేషన్‌లో పాల్గొంటారు. 22న కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశమై, యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్‌లోని సెనెట్ హౌస్, లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శిస్తారు. 23న లండన్ నుంచి బోస్టన్‌కు చేరుకుంటారు. 24న హార్వర్డ్, ఎంఐటీ క్యాంపస్‌లను సందర్శించిన అనంతరం అదే రోజు న్యూయార్క్‌కు వెళ్తారు. 25న నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశమవుతారు. 26న న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొంటారు. 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమై.. 30న నగరానికి చేరుకుంటారు. ఈ పర్యటనలో ప్రముఖ విద్యాసంస్థలతో పరస్పర సహకారం, విద్య, నైపుణ్యాభివృద్ధి అంశాలపై కూడా చర్చలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తెలంగాణలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతమైన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడం, విద్యాసంస్థలతో భాగస్వామ్యాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.
ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక దృష్టి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీతో పాటు ఏఐ, ఐటీ, ఫార్మా, లైఫ్‌సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాల్లోని అవకాశాలను విదేశీ పెట్టుబడిదారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని వివరిస్తూ.. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యవంతమైన మానవ వనరులు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలను వారికి వివరించనున్నారు. సీఎం వెంట స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పర్యటనలో పాల్గొంటారు. పెట్టుబడిదారులతో జరిగే సమావేశాల్లో ప్రభుత్వ ప్రతిపాదనలు, పెట్టుబడి అవకాశాలు, వివిధ ప్రాజెక్టుల వివరాలను అధికారుల బృందం వివరిస్తుంది. పెట్టుబడులకు సంబంధించి అక్కడికక్కడే అవగాహన కల్పించడం, ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సమన్వయం చేయడంపై అధికారులు దృష్టి సారించనున్నారు.
ఉద్యోగాల కల్పనే లక్ష్యం : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం, కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం విదేశీ పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా విదేశీ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించనున్నారు. గతంలోనూ విదేశీ పర్యటనల్లో వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన సీఎం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి పెట్టారు. తాజా పర్యటనలోనూ ఇదే ప్రధాన ఎజెండాగా కొనసాగనుంది.

