CM Revanth Reddy Direction to Officers: రాష్ట్రంలో మొక్కజొన్న పంట సేకరణ 15 రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే నాణ్యమైన ప్రతి మొక్కజొన్న గింజను సేకరించాలన్నారు. మొక్కజొన్న రవాణా చేసేందుకు తగిన వాహనాలు, హమాలీలు, గోనె సంచులు, నిల్వ స్థలం అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రతి సేకరణ కేంద్రం వద్ద ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. అకాల వర్షాల నుంచి పంటలను కాపాడి రోజువారీ కొనుగోలు నివేదికలను సమర్పించాలన్నారు. వాహనాలు, లాజిస్టిక్స్ సమకూర్చడంలో విఫలమైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, అధికారులు రాష్ట్రంలో రోజు సగటున 40 వేల నుంచి 45 వేల మెట్రిక్టన్నుల మొక్కజొన్న సేకరణ చేస్తుండగా.. ఇప్పటివరకు 9.87 మెట్రిక్టన్నుల మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తయ్యాయి.
Also Read: https://teluguprabha.net/national-news/update-on-neet-ug-paper-re-exam/
గోదాముల వద్ద అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు..
ప్రస్తుతం, గోదాముల్లో 4.93 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ సామర్ధ్యం ఉండగా.. ఇక నుంచి రోజువారీగా 50 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి, కొనుగోలు చేసిన పంట నిల్వలు 11,67 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా.. గతం కంటే అదనపు నిల్వలు 1.80 లక్షల మెట్రిక్ టన్నుల మేర పెరిగింది. గోదాముల్లో నిల్వ చేయబడిన పరిమాణం 4.93 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 6.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడం గమనార్హం. రవాణా పెరగడంతో గోనె సంచుల సరఫరా కూడా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. హ్యాండ్లింగ్, రవాణా కాంట్రాక్టర్లతో సమన్వయంతో గోదాం పాయింట్ల వద్ద హమాలీ కూలీలను ఏర్పాటు చేశారు. రవాణా శాఖ సహకారంతో వాహనాలను సమీకరించడం, జిల్లా సరిహద్దుల్లో పర్యవేక్షక అధికారులను నియమించడం ద్వారా వాహనాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అర్హులైన రైతులందరూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా తమ మొక్కజొన్నను కనీస మద్దతు ధరకు అమ్ముకునేలా జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ కొనుగోలు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రైతు తన పంటకు కనీస మద్దతు ధరను పొందేలా, సజావుగా, వేగంగా కొనుగోలు జరిగేలా చూసేందుకు ప్రభుత్వం, టీజీ మార్క్‌ఫెడ్ పనిచేస్తున్నాయి.

