CM Revanth reddy Visit in Khammam District: ఖమ్మం జిల్లాలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి రూ. 362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
Also Read: https://teluguprabha.net/crime-news/up-man-killed-his-room-mate-for-22-rupees-in-medak-district/
మున్నేరు నది నుంచి పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మద్దులపల్లిలో జేఎన్‌టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కూసుమంచిలో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి భూమి పూజ చేశారు.
అనంతరం పాలేరులో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి అగ్రికల్చరల్ మార్కెట్‌ను ప్రారంభించారు. అనంతరం ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది వేడుకల బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
Also Read: https://teluguprabha.net/news/bomb-threat-to-indigo-flight-emergency-landing-in-lucknow/
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.
అయోధ్యను తలపించేలా భద్రాచలం..
‘నా రాజకీయ జీవితాన్ని ఖమ్మంలోనే మొదలుపెట్టా. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రూ. 2కి కిలో బియ్యం ప్రవేశపెడితే.. ఇప్పుడు ప్రజాపాలనలో ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నాం. ఎన్టీఆర్ ఆశయాలను సాధించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. గత ప్రభుత్వం రేషన్ కార్డు రావాలంటే ఉన్నవాళ్లలో ఎవరో ఒకరు చనిపోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు లక్షలాది రేషన్‌కార్డులు అందిస్తున్నాం. అధికారంలోకి వచ్చాక 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. కేసీఆర్ హయాంలో భద్రాచలానికి ఏమీ ఇవ్వలేదు. మా ప్రభుత్వంలో అయోధ్యను తలపించేలా భద్రాచలాన్ని తీర్చిదిద్దుతాం. అందుకోసం భూ సేకరణ జరుగుతోంది.’ అని రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
మంత్రులను బద్నాం చేయొద్దు..
సింగరేణిపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవారికే ఇస్తామని.. ఈ విషయంలో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కుంభకోణం జరిగిందని.. సింగరేణి బొగ్గు మాయమైందని కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నాయని విమర్శించారు. మంత్రులపై వార్తలు రాసేముందు తనను వివరణ అడగాలని.. అనవసరంగా తమ మంత్రులను బద్నాం చేయొద్దని మీడియాకు సూచించారు. మంత్రులపై వార్తలు వస్తే తన గౌరవానికి భంగం కలుగుతుందని.. మీడియాకు వివరణ ఇచ్చేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.

