HomeతెలంగాణAllegations : అబద్ధాల అల్లికలో సీఎం రేవంత్.. ఫడ్నవీస్ భేటీపై బట్టబయలైన వాస్తవాలు: కమలనాథుల కన్నెర్ర!

Allegations : అబద్ధాల అల్లికలో సీఎం రేవంత్.. ఫడ్నవీస్ భేటీపై బట్టబయలైన వాస్తవాలు: కమలనాథుల కన్నెర్ర!

Revanth Reddy Fadnavis appointment controversy : రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. కానీ రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఓ నాయకుడు.. మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన అంశంపై అవాస్తవాలు ప్రచారం చేస్తే? ఇప్పుడు సరిగ్గా తెలంగాణ రాజకీయాల్లో ఇదే అంశం పెను దుమారం రేపుతోంది. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసేందుకు తాను ప్రయత్నించానని, కానీ ఆయన కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాస్తవాలను వక్రీకరించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. 

- Advertisement -

బట్టబయలైన ‘అపాయింట్‌మెంట్’ బాగోతం : హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రాంచందర్ రావు ఆధారాలతో సహా ఎండగట్టారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని అసత్య ప్రచారాలకు దిగడం అత్యంత శోచనీయమని ఆయన తప్పుబట్టారు. “దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి అధికారిక అపాయింట్‌మెంట్ కోరలేదని మహారాష్ట్ర సీఎం కార్యాలయమే స్వయంగా స్పష్టం చేసింది. వాస్తవానికి నెల రోజుల క్రితం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే ఆయన అపాయింట్‌మెంట్ అడిగారు. ఆ విషయాన్ని దాచిపెట్టి.. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రే స్వయంగా తనను కలవనివ్వలేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం” అని రాంచందర్ రావు మండిపడ్డారు.

ఉత్తర-దక్షిణ భారతాల మధ్య ‘విభజన’ చిచ్చు : అసత్యాలతో పబ్బం గడుపుకోవడమే కాకుండా, దేశంలో ప్రమాదకరమైన విభజన రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర సీఎంపై విమర్శలు చేయడం వెనుక.. ఉత్తర-దక్షిణ భారతదేశం (North-South Divide) మధ్య ప్రాంతీయ విద్వేషాలను రగల్చడమే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశమని రాంచందర్ రావు విశ్లేషించారు. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం సాధిస్తున్న అద్భుతమైన పురోగతిని, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన దేశ ప్రతిష్ఠను కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోందని ఆయన ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో తమ ఉనికి కోల్పోతున్నామన్న భయంతోనే ఇలాంటి చౌకబారు ప్రచారాలకు, దొంగ ఏడుపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

మూసీ మురికి.. స్వప్రయోజనాల పరికి : పొరుగు రాష్ట్రాలపై నిందలు వేయడం మాని, ముందు సొంత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం దృష్టి పెట్టాలని బీజేపీ సూచించింది. ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై కాంగ్రెస్ సర్కార్ తీరును రాంచందర్ రావు తూర్పారబట్టారు. “మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం కాదు.. ఆ ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే నిర్వాసితులకు ముందుగా సరైన పునరావాసం  కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి పథకాల ముసుగులో కాంగ్రెస్ నేతలు తమ స్వప్రయోజనాలు, కమీషన్ల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News