CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సమీక్ష సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని కోరారు. ఫ్యూచర్ సిటీలో భూముల కేటాయింపు, పరిశ్రమల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ‘‘అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలి. ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలి. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్‌ను ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రధానిని కలిసి హెల్త్ క్లస్టర్ రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేద్దాం.” అని పేర్కొన్నారు.
Also read: Liquor price: ఇకపై కిక్కుకు ఖర్చెక్కువ.. భారీగా పెరగనున్న మద్యం ధరలు.. ఏ బ్రాండుపై ఎంతంటే?
1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు..
మరోవైపు, జూన్‌లో ఫ్యూచర్ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగేలా చూడాలన్నారు. భూ కేటాయింపులు జరిగిన వెంటనే పరిశ్రమలు స్థాపించేలా నిబంధన విధించాలని తెలిపారు. “ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారి కోసం ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థను రూపొందించాలన్నారు. తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేయాలని, 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్ల సమీపంలోని ప్రభుత్వ భూములు గుర్తించాలన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీ ఏర్పాటుపై దృష్టి పెట్టేలా పాలసీ రూపొందించాలని, మూడు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ-ఫైబర్‌కు కనెక్ట్ కావాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

