CM Revanth Reddy meets South African Vice President: భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్, మెడికల్ టూరిజం, ఇండస్ట్రీలు, ఇన్వెస్ట్‌మెంట్ వంటి పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని కోరారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రత్యేకతలను దక్షిణాఫ్రికా ప్రతినిధులకు సీఎం రేవంత్ వివరించారు. అత్యాధునిక రంగాలకు అవసరమైన నిపుణులను తయారు చేసి ప్రపంచానికి అందించే కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని దక్షిణాఫ్రికా బృందాన్ని ఆహ్వానించారు.
Also read: Madhuyashki wife: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత మధుయాష్కీ భార్యకు తీవ్ర గాయాలు
గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం..
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే దిశగా ఆలోచించాలని కోరారు. ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్న ‘‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026’’లో తప్పకుండా పాల్గొనాలని దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలేను కోరారు. దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను సైతం సీఎం ఆహ్వానించారు. సీఎం ఆహ్వానంపై మషాటిలే స్పందిస్తూ.. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పెద్ద సంఖ్యలో తమ ప్రతినిధులు పాల్గొంటారని హామీ ఇచ్చారు. ఈ సదస్సు ద్వారా ఇరు దేశాల మధ్య వ్యాపార, పారిశ్రామిక సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జర్మనీలోని తురింగియా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న శాస్త్ర సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, జీవ వైజ్ఞానిక రంగాల్లో పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడంలో భాగంగా అవగాహన ఒప్పందం కుదిరింది.

