CPI Centenary Celebrations: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ఆదివారం ఖమ్మం వేదికగా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/medaram-2026-top-places-to-visit-near-medaram-jathara/
ఖమ్మం నగరం ఎర్రజెండాలు, అరుణ తోరణాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. 1925, డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కమ్యూనిజం గుమ్మంలో శతవసంతాల వేడుకలు ఘనంగా జరుపుకొంటోంది. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల మైదానంలో నేడు మధ్యాహ్నం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు దాదాపు 200 మంది జాతీయ స్థాయి నేతలు, 40 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు. శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా సుమారు 10,000 మందితో ‘జన సేవా దళ్ కవాతు’ నిర్వహించగా.. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు సభకు తరలివచ్చారు. ఈ ఉత్సవాల కొనసాగింపుగా జనవరి 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు జాతీయ స్థాయి సెమినార్లు, పార్టీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు.
బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ..
‘సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటిష్ జనతా పార్టీ.. అని రేవంత్ దుయ్యబట్టారు. ‘పేదవాళ్లను అణగదొక్కాలనే ఆలోచనతోనే బీజేపీ మనల్ని అణచివేయాలని బీజేపీ చూస్తోంది. పేదల కోసం ఆనాడు కాంగ్రెస్– కమ్యూనిస్ట్ కలిసి ఉపాధి హామీ పథకాన్ని తీసుకువస్తే.. నేడు కేంద్ర ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తోంది. అదానీ, అంబానీలకు కూలీలకు దొరకడం లేదని ఈ పథకానికి తూట్లు పొడుస్తోంది. పట్టణాలకు వలస వెళ్తే.. మళ్లీ వెట్టి చాకిరి వస్తుంది. కార్పొరేట్లకు తక్కువ రేట్లకే కూలీలు దొరుకుతారు. వారికి మన హక్కులను తాకట్టు పెడుతున్నారు. కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి. రైతులు, రైతు కూలీలకు మేలు జరగాలని సీపీఐ పోరాటం చేస్తోంది. అందుకు కాంగ్రెస్ మద్దతిస్తోంది.’ అని రేవంత్ ప్రసగించారు.
కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. అందుకే సీపీఐ శతాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానించగానే వచ్చానని పేర్కొన్నారు. మున్ముందు నరేంద్ర మోదీ, అమిత్ షా.. ఖమ్మంకి తరలివచ్చినా సర్పంచ్ పదవులను కూడా గెలుచుకోలేరని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడి రాహుల్ గాంధీ ప్రధానిని చేసుకోవాలని రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేశారు.
శతాబ్ధి ఉత్సవాల్లో సీపీఐ ప్రజాపోరాటాలు, చారిత్రక ఘట్టాలు కళ్లకు కట్టేలా కార్యక్రమాలు చేయనున్నారు. ఈ నెల 19న జాతీయ సమితి సమావేశం నిర్వహించనున్నారు. త్వరలో జరిగే కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల్లో పార్టీ.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ నెల 20న నేటి భారతదేశం–వామపక్షాల ముందున్న సవాళ్లు’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తారు. ఇక 21న జరిగే సీపీఐ శతాబ్ది ముగింపు వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.

