CM Revanth Reddy- Ravi Narayana Reddy: తమ ప్రభుత్వం రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితోనే పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ‘రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ పురస్కార’ ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఈ పురస్కారంతో సత్కరించారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి.. పేదల కోసం తన 500 ఎకరాల సొంత భూమిని పంచిపెట్టిన ఆదర్శనీయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు రావి నారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో ‘రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ పురస్కార’ ప్రదానోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఈ పురస్కారం వరించింది. న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజల హక్కుల కోసం పని చేసి సేవలందించడంతో పాటు.. రాజ్యాంగం పట్ల సంపూర్ణ నిబద్ధత కలిగిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం’ ప్రదానం చేయడం అత్యంత సముచితం అని రేవంత్ ఉద్ఘాటించారు. ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడారు.
అడగొద్దు అంటే ఎలా.?
రావి నారాయణ రెడ్డి వంటి వారు 60 ఏళ్లకే స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. కానీ నేటి నేతలు అధికారం కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పాటు కేసీఆర్ కుటుంబంపై ఘాటు రేవంత్ విమర్శలు చేశారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఉద్యమకారులపై ఎక్కువ అవమానాలు జరిగాయని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి ఆరోపించారు. నేరాలు చేస్తాం.. కానీ మమ్మల్ని ఎవరు అడగవద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
జాతిపిత ఎలా అవుతారు?
‘స్వలాభం కోసం పదవులను పంచుకున్న వారు జాతిపిత ఎలా అవుతారు. ఇదెక్కడి జాతిపిత విధానం. నిజమైన జాతిపిత అయితే దేనికి ఆదర్శం. తప్పు చేసిన వారిని విచారిస్తుంటే తప్పేంటి.?. నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటేనే ఇంతలా భయపడిపోతే ఎలా.? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు సహకరించాలి. చట్టం ముందు ఎవరూ అతీతులు కాదు.’ అని ఈ సందర్భంగా సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

