CM Revanth Reddy Army Officials Meeting: ప్రస్తుతం పుణేలో ఉన్న భారత సైన్యం ‘సదరన్ కమాండ్’ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చాలని ఆర్మీ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆర్మీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనాపరమైన అంశాల సత్వర పరిష్కారంపై చర్చ జరిగింది.
రాష్ట్రంలో కొత్తగా ఒక సైనిక్ స్కూల్‌ను మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్మీ ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. గత పదేళ్లలో రాష్ట్రానికి ఒక్క సైనిక్ స్కూల్ కూడా రాలేదని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ సివిల్- మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్.. ఆర్మీకి పలు ప్రతిపాదనలు చేశారు. దేశ భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వికారాబాద్‌లో లో- ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం 3,000 ఎకరాల భూమిని కేటాయించినట్లు సీఎం ఈ సందర్భంగా తెలిపారు.

ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారం కోసం ఆర్మీ వైపు నుంచి ప్రత్యేక అధికారులను నియమిస్తే చర్చలు జరపడం సులభమవుతుందని సీఎం అన్నారు. అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ-ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ, ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/rahu-transit-2026-effects-on-zodiac-signs/
ముందుగా ఈ రోజు ‘సైనిక దినోత్సవం’ (Army Day) సందర్భంగా సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు నివాళులర్పించారు.

