CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం ఉదయం సమావేశమయ్యారు. మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ భేటీలో ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీ, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం.
డీలిమిటేషన్ పై చర్చ
దేశవ్యాప్తంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన వల్ల తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా ఎలాంటి నష్టం కలిగే అవకాశం ఉందనే అంశంపై ప్రధానంగా చర్చించారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లను పెంచితే అభివృద్ధి పథంలో ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మీనాక్షి నటనరాజన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. దీనిపై పార్టీ పరంగా చేపట్టాల్సిన పోరాటాలు, ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం.
నామినేటెడ్ పదవుల భర్తీ
అలాగే.. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేందుకు సీఎం ప్రతిపాదించిన ‘హైబ్రిడ్ మోడల్’ పై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఎన్నికల సమయంలో చురుగ్గా పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించాలని మీనాక్షి నటరాజన్ కోరారు. ఇప్పటికే పదవుల్లో ఉన్న కార్పొరేషన్ ఛైర్మన్ల పనితీరును బేరీజు వేసి వారి పదవీకాలం పొడిగింపు లేదా కొత్త వారి నియామకంపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం.
అనంతరం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం పార్టీ బలోపేతంపై చర్చించేందుకు వారంలోగా రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణ, జిల్లా స్థాయి కమిటీల నియామకంపై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: Breaking: శ్రీసత్యసాయి జిల్లాలో పేలుడు.. నలుగురు స్పాట్ డెడ్!

