CM Revanth Reddy Telangana Legislators Sports and Cultural Meet : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైన ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ – 2026’ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అత్యంత ఉత్సాహంగా స్పోర్ట్స్ ఈవెంట్ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ వేడుకలను ప్రారంభించారు. ప్రజాప్రతినిధులలో క్రీడాస్ఫూర్తిని, ఫిట్‌నెస్ పట్ల అవగాహనను పెంచడం కోసం ఈ రెండు రోజుల వేడుకను ప్రభుత్వం నిర్వహిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా అధికార, విపక్షాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీల్లో పాల్గొన్నారు. మహిళా, పురుష ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా సుమారు 10 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. కాగా సీఎం.. ఫుట్‌బాల్ పోటీలో పాల్గొని నాలుగు గోల్స్ చేసి తన క్రీడా ప్రతిభను చాటుకున్నారు.
Also Read: https://teluguprabha.net/sports-news/srh-owner-kavya-maran-marriage-rumors-with-anirudh-ravichander/
కబడ్డీలో సింగిల్ రైడ్‌లోనే నాలుగు పాయింట్లు సాధించి క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అలరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ పోటీలు కేవలం గెలుపోటముల కోసం కాదని, ప్రజాప్రతినిధుల మధ్య స్నేహభావం, ఐక్యతను పెంపొందించడం కోసమేనని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో వసతులు
గచ్చిబౌలిలోని క్రీడా మైదానాలను సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో ప్రపంచస్థాయి వసతులతో ఆధునీకరిస్తామని సీఎం వెల్లడించారు. 2034 ఒలింపిక్స్ నిర్వహణే లక్ష్యంగా రాబోయే మూడు నెలల్లో ఇక్కడ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఎల్బీ స్టేడియానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాలతో పాటు బేగంపేట హాకీ మైదానం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియాలను కూడా అభివృద్ధి చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. క్రీడాకారులకు ఒలింపిక్స్ స్థాయి శిక్షణ ఇచ్చేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయనున్నారు. గత పద్నాలుగేళ్లుగా నిలిచిపోయిన శాసనసభ్యుల క్రీడా పోటీలను సీఎం పునరుద్ధరించారు. క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే వారికి ప్రభుత్వం తరపున పూర్తి ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

