CM Revanth Reddy Kodangal visit: వికారాబాద్ జిల్లాలో తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి సుమారు రూ. 364 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ప్రధానంగా కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సుమారు రూ. 110 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పునర్నిర్మాణ పనులకు సీఎం భూమిపూజ చేశారు. ఈ ఆలయాన్ని “పేదల తిరుపతి”గా తీర్చిదిద్దుతామని రేవంత్ వెల్లడించారు. అదేవిధంగా రూ. 2 కోట్లతో కోస్గిలోని వేణుగోపాలస్వామి ఆలయం, రూ. 2.14 కోట్లతో దౌల్తాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఆరోగ్య రంగానికి సంబంధించి అభివృద్ధి పనుల్లో భాగంగా మెడికల్ కాలేజీకి అనుసంధానంగా రూ. 255 కోట్లతో నిర్మించనున్న 430 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
అంతకుముందుగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొడంగల్ చేరుకున్న సీఎంకు జిల్లా కలెక్టర్, అధికారులు ఘన స్వాగతం పలికారు. కొడంగల్ బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కొడంగల్ మెట్ట భూములను కృష్ణా నదీ జలాలతో తడపాలన్నదే తన లక్ష్యమని ఈ సందర్భంగా రేవంత్ ఉద్ఘాటించారు.
వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిపథాన తీసుకెళ్లాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అంతా కలిసి వస్తున్నారు. పేదల తిరుపతిగా ‘కొడంగల్’ శ్రీవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. పక్కనే కృష్ణా నది ప్రవహిస్తున్నా.. గతంలో సాగు, తాగు నీటికి ఇబ్బందిగా ఉండేది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి మంత్రి పదవి దక్కించుకున్న వారు లేరు. ఇప్పుడు కొడంగల్ బిడ్డ తెలంగాణ సీఎంగా ఉన్నాడు. రోజూ 18 గంటలు కష్టపడుతున్నా.. ఇంకా సమస్యలున్నాయి.. వాటిని పరిష్కరిస్తాం – సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ విద్యా ముఖ చిత్రాన్ని మారుస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. గతంలో ఇక్కడి పిల్లలు చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారని.. ఇప్పుడు బయటివారు ఇక్కడికి వచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా లగచర్ల ప్రాంతంలో ఎడ్యుకేషన్ హబ్, పరిశ్రమలు స్థాపించి.. స్థానిక యువతకి ఉపాధి, ఉన్నత విద్యను చేరువ చేస్తామని చెప్పారు. తద్వారా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

