Education Week- CM Revanth Reddy: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడం తన ప్రాధాన్యత అని, అందుకే విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘విద్యా వారోత్సవాల’ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సుమారు రూ.1,100 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు సీఎం రేవంత్ గుర్తు చేశారు. దశాబ్దాలుగా తెలంగాణ విద్యా రంగం వివక్షకు గురైందని, యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురైతే విద్యా ప్రమాణాలు పడిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉద్ఘాటించారు.
‘కులమతాలకు అతీతంగా విద్యార్థులందరూ కలిసి చదువుకునేలా ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ను ప్రభుత్వం నిర్మిస్తోంది. విద్యా పనితీరులో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ సంస్థల కంటే వెనుకబడి ఉండటం ఆందోళనకరం. ఈ వ్యవస్థకు నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం. విద్యాశాఖకు అంచలంచెలుగా 15 శాతం నిధులు కేటాయింపు చేస్తాం. ఇతర దేశాల్లో ఉన్న నాణ్యమైన, సాంకేతిక విద్యను పరిశీలించడానికి మన టీచర్లను పంపిస్తున్నాం. ఏటా 500 మంది టీచర్లను విదేశాలకు పంపించి అక్కడి నైపుణ్యాన్ని ఇక్కడా ప్రవేశపెడదాం. అంతర్జాతీయ విద్యా విధానాలపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే కొందరిని ఫిన్లాండ్ పంపాం. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు పంపేందుకు చర్యలు చేపడతాం. నేషనల్ ఎడ్యుకేషన్ మారింది. తెలంగాణలో కూడా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలి.’ -సీఎం రేవంత్
సామాజిక మార్పు తీసుకురావడానికి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల భవిష్యత్తును మెరుగుపరచడానికి విద్యే అత్యంత శక్తివంతమైన సాధనమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వివాదాలకు తావు లేకుండా దాదాపు 36,000 మంది ఉపాధ్యాయులను పారదర్శకంగా బదిలీ చేశామని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 27,000 పాఠశాలలు ఉండగా, వాటిలో దాదాపు 19 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-about-pm-narendra-modi-and-owaisi/
‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం ఉన్న మధ్యాహ్న భోజన కార్యక్రమంతో పాటు, ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టాం. పాతబడిన సిలబస్ విధానాలు, సరైన టెన్ ప్లస్ టూ వ్యవస్థ లేకపోవడం వంటివి 10వ తరగతి తర్వాత డ్రాపౌట్ రేట్లు పెరగడానికి కారణం. ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే సంస్థలుగా మారాలి.’ – సీఎం రేవంత్

