CM Revanth visit on June 4th and 5th: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండ్రోజుల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు ప్రత్యేక హెలికాప్టర్‌లో జూన్ 4న మహబూబ్‌నగర్‌కు రానున్నారు. ముందుగా మక్తల్ నియోజకవర్గానికి చేరుకొని అక్కడ నూతనంగా చేపట్టిన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనుల పరిస్థితులు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై నిర్మించ తలపెట్టిన బ్యారేజీల స్థితిగతులను పరిశీలించిన అనంతరం జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు.
Also Read: Minister Tummala: తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా మక్కలు కొనడం లేదు.. మంత్రి తుమ్మల స్పష్టం
జూరాలను స్వయంగా పరిశీలించనున్న సీఎం..
అక్కడ జూరాల స్థితిగతులను ముఖ్యమంత్రి స్వయంగా అధికార బృందంతో కలిసి సమీక్షిస్తారు. వీటితో పాటు ఎత్తిపోతల, ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 4న రాత్రి కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల కు చేరుకొని అక్కడే బస చేయనున్నారు. ఇక, 5వ తేదీన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బహిరంగ సభను నిర్వహించే ఛాన్స్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైన నేపథ్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆదివారం భూత్పూర్ మండలం కరివేన రిజర్వాయర్‌ను ఇరిగేషన్ సీఈలు సత్యనారాయణ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను జయప్రదం చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం పర్యటన విజయవంతం చేయాలని కోరారు.

