CM Revanth Reddy Convoy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాకుండా స్వయంగా తాను ఆచరించి చూపారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజలకు ఆటంకం కలిగించొద్దంటూ బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి డీజీపీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం మేరకు.. ఇవాళ (గురువారం) హైదరాబాద్‌లో ఆయన కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణం చేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసానికి సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం వెళ్లడం విశేషం. తన కాన్వాయ్ రాకపోకల కోసం నగరవ్యాప్తంగా ప్రజల వాహనాలను నిలిపివేయొద్దంటూ నిన్న సీనియర్ పోలీసు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యల్ని పూర్తిగా నివారించాలని డీజీపీకి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి త్వరలోనే ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ బ్యూరో’ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. ఇకపై వీఐపీ కాన్వాయ్‌లు వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా, సింగిల్ లైన్‌లో వాహనాలను అనుమతించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఇవాళ సీఎం కాన్వాయ్ వస్తున్న క్రమంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడానికి బదులుగా ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఒకే లేన్‌లో కదలడానికి అనుమతించారు.
అమలు చేయకుంటే.. కఠిన చర్యలు..
కాగా, ఇటీవల తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు మార్గంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ కోసం సామాన్య ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, ఎదురుగా వచ్చే వాహనాలను ఆపి ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచించారు. దీన్ని పక్కాగా అమలు చేయాలని, అతిగా ప్రవర్తించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

