Telanga MunicipaL Elections: తెలంగాణ మున్సిపాలిటీలో ఆద్యంతం అధికార పార్టీ హవానే కొనసాగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలనే ఇక్కడా రిపీట్ చేస్తూ తనకు తిరుగు లేదని కాంగ్రెస్ మరోసారి నిరూపించింది. అత్యధికంగా మున్సిపల్ ఛైర్మన్ పీఠాలు కైవసం చేసుకుని విజయఢంకా మోగించింది.
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 116 మున్సిపాలిటీల్లో సగానికి పైగా స్థానాల్లో(66) కాంగ్రెస్ పాగా వేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ 13 మున్సిపాలిటీలకే పరిమితమైంది. ఇక బీజేపీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. వడ్డేపల్లి మున్సిపాలిటీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతు తెలిపిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి దక్కించుకున్నారు. 36 స్థానాల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఆయా మున్సిపాలిటీల ఛైర్మన్ల పీఠం కోసం ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది.
Also Read: https://teluguprabha.net/telangana/municipal-elections-hung-in-these-municipalities/
వార్డుల వారీగా చూస్తే 2,582 వార్డుల్లో సగానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా 1347 స్థానాల్లో గెలుపొందింది. బీఆర్‌ఎస్ 717 వార్డులు దక్కించుకుంది. బీజేపీ 261 వార్డుల్లో విజయం సాధించింది. ఇతరులు 256 వార్డుల్లో గెలుపొందారు. కాగా, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ ఆరవ వార్డు బీజేపీ అభ్యర్థి కన్నుమూయడంతో ఎన్నిక జరగలేదు.

