CP Sajjanar Gas Connection KYC: వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారని వెల్లడించారు. అంతేకాకుండా గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో మరో మోసానికి పాల్పడుతూ కస్టమర్ల ఖాతాలను కొల్లగొడుతున్నారని.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
గ్యాస్ కనెక్షన్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలంటూ సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. మీ మొబైల్‌కు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే గుర్తుతెలియని లింక్‌లు క్లిక్ చేసి, వారు పంపిన ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ బ్యాంకు ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుందని.. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఒక చిన్న యాప్ డౌన్‌లోడ్ చేస్తే చాలు, మీ కష్టార్జితం మొత్తం నేరగాళ్ల పాలవుతుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో వెలుగుచూసిన తాజా ఘటనే ఇందుకు నిదర్శనంగా ఉదహరించారు. ఈ మేరకు ‘X’లో పోస్ట్ చేశారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-ustaad-bhagat-singh-official-trailer-release/
‘మహారాష్ట్రలోని డోంబివాలి ప్రాంతంలో ఇద్దరు మహిళలకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. తాము ప్రముఖ గ్యాస్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని, గ్యాస్ సిలిండర్ సమాచారాన్ని వెంటనే అప్‌డేట్ చేయాలని నమ్మించారు. ఆ తర్వాత వాట్సాప్‌లో ఒక ఏపీకే ఫైల్ పంపించి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసి, అందులో ఉన్న ఫారం నింపాలని సూచించారు. ఆ మహిళలు వారు చెప్పినట్లే ఆ ఫైల్ ఇన్‌స్టాల్ చేసి వివరాలు నమోదు చేయగానే.. వారి బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా రూ. 4 లక్షలు మాయం అయ్యాయి.’
ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ పేర్కొన్నారు. నేరగాళ్లు పంపే ఏపీకే ఫైల్స్ చాలా ప్రమాదకరమైనవని.. వీటిని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయగానే, మన మొబైల్ నియంత్రణ మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోతుందని తెలిపారు. ఫోన్‌కు వచ్చే ఓటీపీలు, బ్యాంకు మెసేజ్‌లు అన్నీ వారికి నేరుగా చేరిపోతాయని.. దీని ద్వారా మీకు తెలియకుండానే ఖాతాల్లోని డబ్బును కాజేస్తారని వెల్లడించారు. గ్యాస్ ఏజెన్సీలు గానీ, ప్రభుత్వ సంస్థలు గానీ వివరాలు నమోదు చేయడానికి ఎప్పుడూ ఇలాంటి థర్డ్-పార్టీ ఫైల్స్ పంపవని ప్రజలు గ్రహించాలని సూచించారు. అపరిచితులు పంపే యాప్స్‌ను అసలే ఇన్‌స్టాల్ చేసుకోవద్దని స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/medak-news/three-killed-in-road-accident-bike-hits-rtc-bus/
‘గ్యాస్ బుకింగ్ లేదా కేవైసీ కోసం ఎల్లప్పుడూ అధికారిక యాప్స్, వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలి. ఏదైనా అనుమానం వస్తే నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుకు వెళ్లి సంప్రదించడం ఉత్తమం. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి. లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. ఆన్‌లైన్ మోసాలకు అప్రమత్తతే అసలైన విరుగుడు. దయచేసి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేసి వారిని సైతం అప్రమత్తం చేయండి.’ అని సజ్జనార్ సూచించారు.

