పాల్వంచ, అక్టోబర్ 3 (తెలుగు ప్రభ): పాల్వంచ డివిజన్‌లోని నవభారత్, గాంధీనగర్ ప్రాంతాల్లో గత రెండు వారాలుగా నివసిస్తున్న పేదలందరికీ న్యాయం జరిగే వరకు సీపీఎం పార్టీ పోరాటం చేస్తుందని జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. టౌన్ పార్టీ కార్యవర్గ సభ్యుడు కె.సత్య అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో నిరుపేదలతో చెలగాటం ఆడుతున్నాయని విమర్శించారు. పది సంవత్సరాలుగా ఈ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ఇళ్లు పూర్తి చేసి ఇవ్వకపోగా.. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అప్పటి, ఇప్పటి ప్రభుత్వ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని అన్నారు.
అధికారుల తప్పిదాలకు పేదలు నష్టపోవాలా? అని ప్రశ్నించారు. దఫదఫాలుగా అధికారులకు అర్హులైన పేదల పేర్లతో కూడిన జాబితాలను అందజేసినప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి నిర్మాణాలు పూర్తి చేయకుండానే లక్కీ డ్రాల ద్వారా ఇళ్లు కేటాయించడం వల్ల నిజమైన లబ్ధిదారులకు నష్టం జరిగిందని ఆరోపించారు. నష్టపోయిన ప్రజలు సీపీఎం పార్టీని ఆశ్రయించి ఇక్కడికి వచ్చారని, రెండు వారాలుగా 150 మంది పేదలు ఇక్కడ నివాసం ఉంటున్నారని తెలిపారు. ఇక్కడి నుంచే వీరందరినీ విచారించి అర్హులను గుర్తించాలని, గుర్తించిన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదని, పేదలకు అండగా సీపీఎం పార్టీ పోరాడుతుందని మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ రవికుమార్, పట్టణ కార్యదర్శి పి. తులసీరామ్, కార్యదర్శివర్గ సభ్యులు సత్యవాణి, ఎస్‌కే నిరంజన్, కమిటీ సభ్యులు సులోచన, వింజరాములు, బీ. కాంతి, శాఖ కార్యదర్శి యాకోబు, సత్య, కవిత తదితరులు పాల్గొన్నారు.

