- విద్యుత్ ఛార్జీల పెంపునకు ఏపీ, తమిళనాడు నో
- గృహ వినియోగదారులకు 10 శాతం టారిఫ్ తగ్గించిన మహారాష్ట్ర
- మన రాష్ట్రంలో మాత్రం దొడ్డిదారిన బాదుడు
- టారిఫ్ పెంపు లేదంటూనే భారం మోపడంపై ప్రశ్నలు
- పక్క రాష్ట్రాలను చూసైనా నేర్చుకోరా? అంటూ ధ్వజం
- విద్యుత్ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ ప్రజాపోరు
- రూ.5,420 కోట్ల భారాన్ని ఉపసంహరించుకోవాలి
- ట్రూ అప్ చార్జీలు ప్రభుత్వమే భరించాలి
- మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 6 (తెలుగుప్రభ) : ‘ట్రూ – అప్’ పేరుతో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం మోపాలన్న ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) ఆమోదించిన రూ.7,635.22 కోట్ల ట్రూ – అప్ మొత్తంలో రూ.5,420.23 కోట్లను వినియోగదారుల నుంచి వసూలుచేయనుండగా, రూ.2,214.99 కోట్ల వ్యవసాయానికి సంబంధించిన మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం భరించనుంది. నవంబర్ 2026 బిల్లుల నుంచి అదనపు వసూళ్లు ప్రారంభం కానున్నాయి. తొలి నెలలో యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత నెలల్లో 50 పైసల చొప్పున వసూలు చేయనున్నారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.4,222.93 కోట్లు, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో రూ.1,197.30 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. దీంతో 100 యూనిట్లు వినియోగించే వారికి తొలి నెలలో సుమారు రూ.30, ఆ తర్వాత నెలల్లో రూ.50 వరకు అదనపు భారం పడనుంది.
టారిఫ్ పెంచబోమంటూనే..
2026 – 27 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ టారిఫ్ పెంచబోమని ప్రభుత్వం, డిస్కంలు గతంలో ప్రకటించాయి. టీజీఎస్పీడీసీఎల్‌కు రూ.9,583 కోట్ల ఆదాయ లోటు ఉన్నప్పటికీ టారిఫ్ పెంపు ప్రతిపాదించలేదు. ఆ లోటును ప్రభుత్వం భరిస్తుందని అప్పట్లో పేర్కొంది. అయితే ఇప్పుడు ట్రూ – అప్ పేరుతో రూ.5,420 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. టారిఫ్ పెంచలేదని చెబుతూనే ఇతర రూపంలో బిల్లులు పెంచడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పొరుగు రాష్ట్రాల్లో భిన్న వైఖరి
విద్యుత్ కొనుగోలు వ్యయం, ఆదాయంలో వ్యత్యాసాలను ఇతర వనరులతో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని అమలు చేయడంపై ప్రభుత్వాలు వెనుకంజ వేస్తున్నాయని పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో గృహ వినియోగదారులకు 10 శాతం వరకు టారిఫ్ తగ్గించినట్టు చెబుతున్నారు. అయితే, మన రాష్ట్రంలో మాత్రం ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నందున ప్రభుత్వం ముందు ఛార్జీల పెంపు మినహా మరో మార్గం లేకుండా పోయిందని వారు అభిప్రాయపడుతున్నారు.
లోటు భారం వినియోగదారుడిపైనేనా?
విద్యుత్ కొనుగోలు వ్యయాలు పెరగడం, డిస్కంల ఆర్థిక లోటు, గత సంవత్సరాల లెక్కల సర్దుబాట్ల కారణంగా ట్రూ – అప్ అవసరమని అధికారులు చెబుతున్నారు. అయితే డిస్కంల ఆర్థిక నిర్వహణలో ఏర్పడిన లోటును పూర్తిగా వినియోగదారులపై మోపడం ఎంతవరకు సమంజసమన్న చర్చ జరుగుతోంది. టారిఫ్‌ను అధికారికంగా పెంచకుండా ట్రూ – అప్, సర్దుబాటు ఛార్జీల పేరుతో బిల్లులు పెంచడంపై వినియోగదారుల్లో అయోమయం నెలకొనే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఎన్ని నెలలు వసూలు చేస్తారు?
రూ.5,420 కోట్లను ఎన్ని నెలల్లో వసూలు చేస్తారు? ప్రతి వర్గం వినియోగదారుడిపై ఎంత భారం పడుతుంది? ఏ లెక్కల ఆధారంగా ఈ మొత్తాన్ని నిర్ణయించారు? విద్యుత్ కొనుగోలు, ఆదాయ అంచనాల్లో ఏర్పడిన లోటుకు బాధ్యత ఎవరిది? భవిష్యత్తులో ఇలాంటి అదనపు వసూళ్లు ఉంటాయా? అనే అంశాలపై ప్రభుత్వం, డిస్కంలు స్పష్టత ఇవ్వాలని వినియోగదారులు కోరుతున్నారు. ఈ లోటు పూడేలోగా మరో లోటు తెరపైకి వస్తుందేమోననే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఏమిటీ ట్రూ – అప్?
డిస్కంలు ముందుగా అంచనా వేసిన విద్యుత్ కొనుగోలు వ్యయం, వాస్తవంగా జరిగిన ఖర్చు మధ్య తేడాను తర్వాత లెక్కగట్టి సర్దుబాటు చేయడమే ‘ట్రూ – అప్’. విద్యుత్ టారిఫ్ నిర్ణయించే సమయంలో భవిష్యత్ విద్యుత్ కొనుగోలు వ్యయం, ఆదాయం తదితరాలను అంచనా వేస్తారు. తర్వాత వాస్తవ ఖర్చు ఎక్కువైనా లేదా ఆదాయం అంచనాకు భిన్నంగా ఉన్నా ఆ తేడాను నియంత్రణ మండలి పరిశీలించి సర్దుబాటు చేస్తుంది. ఇది సాంకేతికంగా సాధారణ టారిఫ్ పెంపు కాకపోయినా, వినియోగదారుడి దృష్టిలో నెలవారీ విద్యుత్ బిల్లు పెరుగుతుంది.
విద్యుత్ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ ప్రజాపోరు: హరీశ్ రావు
విద్యుత్ ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.5,420 కోట్ల భారాన్ని ప్రజలపై మోపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రజాపోరాటం చేపడతామని హెచ్చరించారు. దసరా, దీపావళి వేళ ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం విద్యుత్ బిల్లుల రూపంలో భారం మోపుతోందని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఒకవైపు ఎల్‌నినో, మరోవైపు ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో ట్రూ అప్ చార్జీల పేరుతో రూ.5,420 కోట్లు వసూలు చేయడం సరికాదన్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలనే దుర్మార్గమైన ఆలోచనను వెనక్కి తీసుకోవాలన్నారు. విద్యుత్ కొనుగోళ్ల కోసం చేసిన ఖర్చును వినియోగదారులపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సర్కార్ తుగ్లక్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రికి పరిపాలన చేతగాక చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. పరిపాలనపై ధ్యాస లేదనేందుకు సంక్షోభంలో కూరుకుపోతున్న విద్యుత్ రంగమే నిదర్శనమని పేర్కొన్నారు. తప్పు చేసింది.. విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కానీ భారం మాత్రం ప్రజలపై వేస్తున్నారని విమర్శించారు. 2016 – 17 నుంచి 2021 – 22 వరకు ట్రూ అప్ చార్జీల కింద రూ.12,718.40 కోట్లు వసూలు చేయాలని ఈఆర్‌సీ సూచించినప్పటికీ, అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు అనుమతించలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో సంస్థలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, ఆ భారాన్ని ప్రజలపై మోపడం సరికాదన్నారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటనను ప్రస్తావిస్తూ.. విద్యుత్ సమస్యల నుంచే తెలంగాణ ఉద్యమానికి బీజం పడిందన్నారు.
కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ సరఫరా అందించామని, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ రంగం సంక్షోభంలో ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. యాదాద్రిలో యాష్, కోల్ ప్లాంట్ల ప్రైవేటీకరణ జరిగిందని ఆరోపించారు. విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ట్రూ-అప్ పేరుతో వినియోగదారులపై విధించనున్న రూ.5,420 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే మరో ప్రజా ఉద్యమానికి బీఆర్‌ఎస్ సిద్ధమవుతుందని హరీశ్ రావు హెచ్చరించారు.

