Monday, February 16, 2026
HomeతెలంగాణCyber : ఖాతాలో కాసులు.. కేటుగాళ్ల కన్ను! మీ బ్యాంక్ బ్యాలెన్స్ కేటుగాళ్లకు ఎలా తెలుస్తోంది?

Cyber : ఖాతాలో కాసులు.. కేటుగాళ్ల కన్ను! మీ బ్యాంక్ బ్యాలెన్స్ కేటుగాళ్లకు ఎలా తెలుస్తోంది?

Cyber Crime Bank Staff nexus : మీ బ్యాంకు ఖాతాలో భారీగా నగదు జమైందా? ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ అయ్యిందా? అది మీకే కాదు.. వేల మైళ్ల దూరంలో కూర్చున్న సైబర్ నేరగాడికి కూడా తెలిసిపోతోంది! “నా వివరాలు ఎవరికీ చెప్పలేదు కదా, వాళ్లకి ఎలా తెలిసింది?” అని మీరు ఆశ్చర్యపోయేలోపే మీ అకౌంట్ ఖాళీ అయిపోవచ్చు. అవును, సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కేవలం లింకులు పంపడం లేదు, నేరుగా మీ ఆర్థిక జాతకాన్నే చేతుల్లో పెట్టుకుని దాడి చేస్తున్నారు. ఇన్నాళ్లూ అదృశ్య శత్రువుల గురించి భయపడ్డాం, కానీ ఇప్పుడు మనకు రక్షణగా ఉండాల్సిన ‘కంచే చేను మేస్తోంది’. బ్యాంకుల్లోని కొందరు కక్కుర్తి పరుల వల్ల సామాన్యుడి సొమ్ముకు రెక్కలు వస్తున్నాయి. అసలు ఈ సమాచారం చేతులు ఎలా మారుతోంది? ‘సీఐఎఫ్’ (CIF) నంబర్ వెనుక ఉన్న మతలబు ఏంటి? పోలీసుల దర్యాప్తులో తేలిన ఆ దిగ్భ్రాంతికర నిజాలేంటో ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

విక్రయానికి ‘సీఐఎఫ్’.. కేటుగాళ్ల చేతికి మాస్టర్ కీ : నగర పోలీసులు జరిపిన లోతైన దర్యాప్తులో ఒక నమ్మలేని నిజం వెలుగు చూసింది. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల్లో పనిచేసే కొందరు మేనేజర్లు, సిబ్బందిని తమ ‘ఏజెంట్లు’గా మార్చుకుంటున్నారు.

అసలేమిటి ఈ సీఐఎఫ్ (CIF)

11 అంకెల రహస్యం: ఇది ప్రతి ఖాతాదారుడికి ఉండే ప్రత్యేకమైన ‘కస్టమర్ ఐడెంటిఫికేషన్ ఫైల్’. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బీమా పాలసీలను అనుసంధానించే ‘మాస్టర్ కీ’.

సమాచార విక్రయం: కొందరు బ్యాంకు సిబ్బంది ఈ సీఐఎఫ్ నంబర్లను కేటుగాళ్లకు విక్రయిస్తున్నారు. దీనివల్ల ఏ ఖాతాలో ఎంత డబ్బు ఉంది, ఎవరు రిటైర్డ్ ఉద్యోగులు, ఎవరికి డీడీలు జమయ్యాయి వంటి పూర్తి వివరాలు నేరగాళ్ల స్క్రీన్ల మీద ప్రత్యక్షమవుతున్నాయి.
థర్డ్ పార్టీ లీకేజీ: బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్ నిర్వహణ కోసం ఐటీ కంపెనీలకు లేదా క్రెడిట్ కార్డు ఏజెంట్లకు ఈ వివరాలు ఇస్తుంటాయి. అక్కడ కూడా డేటా చోరీ జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

డిజిటల్ అరెస్ట్: భయపెట్టి.. దోచేసి : ఖాతాలో డబ్బున్న వారిని గుర్తించాక, నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త నాటకానికి తెరలేపుతున్నారు. “మీ పేరు మీద సిమ్ కార్డుతో మానవ అక్రమ రవాణా జరిగింది.. మీపై సీబీఐ, ఈడీ విచారణ ఉంది” అంటూ వీడియో కాల్స్ చేస్తారు. పోలీసు దుస్తుల్లో కనిపిస్తూ బాధితులను గంటల తరబడి ఇంటికే పరిమితం చేస్తారు.  ఇటీవల హైదరాబాద్‌లో ఒక ఎమ్మెల్యే నుంచి రూ.1.07 కోట్లు, ఓ వృద్ధుడి నుంచి ఏకంగా రూ.7 కోట్లు ఇలాగే దోచుకున్నారు.

జాగ్రత్త.. ఈ నంబర్ డయల్ చేస్తే మీ వాట్సాప్ మటాష్ : కేటుగాళ్లు మరో ప్రమాదకరమైన ఎత్తుగడ వేస్తున్నారు. కొరియర్ వచ్చిందని నమ్మించి, కన్ఫర్మేషన్ కోసం *21* అనే నంబర్‌కు డయల్ చేయమంటున్నారు. ఇది డయల్ చేయగానే మీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వారి నంబర్‌కు ‘ఫార్వర్డ్’ అవుతాయి. దీని ద్వారా మీ వాట్సాప్‌ను హ్యాక్ చేసి, మీ బంధుమిత్రులకు ‘అర్జంటుగా డబ్బు కావాలి’ అని మెసేజ్‌లు పంపి వారిని కూడా బురిడీ కొట్టిస్తారు.

అప్రమత్తతే అస్త్రం : “అతి ఆశ ప్రమాదం.. అనుమానం రక్షణ” అన్న సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. పోలీసులు ఎన్నడూ ఫోన్ కాల్‌లో అరెస్టులు చేయరని, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మోసపోయామని తెలిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా https://cybercrime.gov.in/ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News