15 రోజుల్లో పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాల పరిష్కారం
ఏరియా ఆసుపత్రుల్లోనే మెడికల్ బోర్డులు.. కాలనీల ఆధునికీకరణ
గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్.. కార్మికుల భద్రతపై రాజీ వద్దు
సింగరేణి కార్మికుల సమస్యలపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బీఆర్‌ఎస్‌కు గతమే.. భవిష్యత్తు లేదు
మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలో ప్రజలకు చెప్పాలి
27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం.. ప్రపంచంలో ఎక్కడా లేదు
సంక్షేమం ఉచితం కాదు.. మానవ వనరులపై పెట్టుబడే
నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ బీమా
ఉప ముఖ్యమంత్రి భట్టి
మునగాలలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన
హైదరాబాద్, అక్టోబర్ 6 (తెలుగుప్రభ): సింగరేణి బొగ్గు గని కార్మికులు, వారి కుటుంబాలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్మికుల ఉద్యోగ, వైద్య, నివాస, ఆరోగ్య సమస్యలతో పాటు సింగరేణి ప్రాంతాల అభివృద్ధిపై సమగ్రంగా దృష్టి సారించారు. మంగళవారం ప్రజాభవన్‌లో సింగరేణి ప్రాంత మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, పలువురు ఎమ్మెల్యేలు, కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్‌తో పాటు సింగరేణి ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న సుమారు 250 నుంచి 300 డిపెండెంట్ ఆర్డర్లతో పాటు వాటికి సంబంధించిన లీగల్ ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేసి అభ్యర్థులకు ఉద్యోగాలు అందించాలని భట్టి అధికారులను ఆదేశించారు. డిపెండెంట్ ఉద్యోగుల పేర్ల మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సుమారు 136 నుంచి గరిష్టంగా 170 మంది సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించాలని సూచించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సింగరేణి అధికారుల కమిటీ సిఫార్సుల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికులు కొత్తగూడెం వరకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో ప్రతి నెలా నిర్ణీత రోజున మెడికల్ బోర్డు సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. అక్కడే వీలైనంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
డిస్మిస్ అయిన వారికి వన్‌టైం చాన్స్
కరోనా సమయంలో లేదా ఇతర స్థానిక కారణాలతో విధులకు హాజరు కాలేక ఉద్యోగాల నుంచి తొలగించబడిన కార్మికులను వన్‌టైం ఆప్షన్ కింద తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అదే సమయంలో విధులకు హాజరు కాకుండా సమ్మెలకు పిలుపునిచ్చిన లేదా సమ్మెల్లో పాల్గొన్న అధికారులపై, నాయకత్వం వహించిన వారిపై నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ డ్యూటీస్ కింద హెచ్చరిక జారీ చేయాలని సూచించారు. సింగరేణికి కేటాయించిన భూముల్లో 5,774 ఎకరాలను సంస్థ తిరిగి రెవెన్యూ శాఖకు అప్పగించిందని సమావేశంలో వివరించారు. ఇందులో 4,500 ఎకరాలను గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేశారని తెలిపారు. మిగిలిన సుమారు 1,250 ఎకరాల్లో జీవో నంబర్ 76 ప్రకారం అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భట్టి ఆదేశించారు. సింగరేణి అధికారులు, జిల్లా కలెక్టర్‌తో కూడిన కమిటీ ఆక్రమణలో ఉన్న నివాసితుల ప్రాథమిక జాబితాను రూపొందించాలని, స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించి అర్హులైన లబ్ధిదారుల సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను ఒక నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సింగరేణికి చెందిన భూముల్లో ఇప్పటివరకు మైనింగ్ చేయని ప్రాంతాలను గుర్తించి కార్మికులు, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి లేఅవుట్లు సిద్ధం చేయాలని భట్టి సూచించారు. నెహ్రూ హౌసింగ్ కాలనీల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. శిథిలమైన డి-టైప్ క్వార్టర్లను తొలగించి వాటి స్థానంలో అన్ని వసతులతో ఆధునిక క్వార్టర్లను నిర్మించాలని చెప్పారు. సింగరేణి కాలనీలన్నింటినీ ఆధునికీకరించాలని, అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ, విద్యుదీకరణ, పారిశుధ్యం, మంచినీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. కాలనీల్లో మురుగు శుద్ధి కేంద్రాలను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు.
సింగరేణి ఆసుపత్రులకు కార్పొరేట్ హంగులు
సింగరేణి ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని భట్టి ఆదేశించారు. సాధారణ కార్మికుడు కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా సింగరేణి ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందేలా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అవసరమైతే వైద్యుల వేతనాలు, పరిహారాలను పెంచి నిపుణులైన వైద్యులను నియమించాలని చెప్పారు. అత్యవసర వైద్యం కోసం కార్డియాక్, క్యాథ్‌ల్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. బొగ్గు గనులు, ఓవర్ బర్డెన్ డంప్‌ల నుంచి వెలువడే దుమ్ము కారణంగా ప్రాంతీయ ప్రజల్లో క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని పలు అధ్యయనాలు సూచిస్తున్న నేపథ్యంలో సింగరేణి పరిధిలోని పాత జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి గ్రామానికి వెళ్లి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని భట్టి ఆదేశించారు. సింగరేణి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ భవనాలను సోలరైజ్ చేయాలని సూచించారు. సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని భట్టి ఆదేశించారు. రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు భట్టి విక్రమార్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భూపాలపల్లి నియోజకవర్గంలో అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు సింగరేణి నుంచి భూమి కేటాయించాలని, అందుకు ప్రత్యామ్నాయంగా రెవెన్యూ శాఖలోని నిరుపయోగ గుట్టల భూములపై నివేదిక ఇవ్వాలని సూచించారు. సింగరేణి కార్మికులకు భద్రతా పరికరాలు అత్యంత కీలకమని పేర్కొంటూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సేఫ్టీ కిట్లు పంపిణీ చేయాలని భట్టి ఆదేశించారు. కార్మికుల భద్రత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. సింగరేణి ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగానే కార్మికులందరికీ సంబంధించిన ఆదాయపన్నును కూడా సంస్థే ప్రభుత్వానికి చెల్లించాలని భట్టి ఆదేశించారు. సత్తుపల్లి, భూపాలపల్లి ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు కేటాయించాలని సూచించారు. కార్మికులు, వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఆధునిక కాలనీలు, మెరుగైన వైద్యం, సురక్షితమైన పని వాతావరణం, విద్యా–తాగునీటి సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్‌కు గతమే.. భవిష్యత్తు లేదు
సూర్యాపేట, అక్టోబర్ 6 (తెలుగుప్రభ): పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయని బీఆర్‌ఎస్.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తామని చెబుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీలేని రుణాలను కొనసాగిస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని.. బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాలలో రూ.9.60 కోట్లతో నిర్మించనున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి భట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. మునగాల కిచెన్ ద్వారా సుమారు 60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారానికి ఆరు రోజులపాటు అల్పాహారం అందిస్తున్నామని, ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
27 లక్షల మందికి అల్పాహారం
రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారానికి ఆరు రోజులపాటు పౌష్టికాహారం అందిస్తున్నామని భట్టి తెలిపారు. మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగిజావ ఇస్తున్నామని చెప్పారు. పిల్లలకు అందిస్తున్న ఆహారం ఖర్చు కాదని.. రాష్ట్ర భవిష్యత్తు మానవ వనరులపై చేస్తున్న పెట్టుబడి అని పేర్కొన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి నాణ్యమైన విద్యను అభ్యసిస్తే రాష్ట్ర ఉత్పాదకత, జీఎస్‌డీపీ వృద్ధికి దోహదపడతారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ‘ఉచితాలు’గా చూడొద్దని, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులపై చేస్తున్న వ్యయం భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే పెట్టుబడి అని భట్టి వివరించారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు తెలిపారు. కుటుంబ యజమాని ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక భద్రత కల్పించేలా పథకాన్ని రూపొందిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని భట్టి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ విద్యార్థులు సమాన అవకాశాలతో చదివేలా వీటిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
నాణ్యమైన ఆహారం, విద్యే లక్ష్యం: ఉత్తమ్
గ్రామీణ విద్యార్థులకు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి విజ్ఞప్తి మేరకు సింగరేణి సంస్థ ఈ ప్రాజెక్టుకు రూ.9.60 కోట్ల ఆర్థిక సహకారం అందిస్తోంది. మునగాల కిచెన్ ద్వారా జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు అల్పాహారంతోపాటు పాలు, రాగిజావ అందించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఆహార నాణ్యత, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. విద్యతోపాటు పౌష్టికాహారం అందితే విద్యార్థుల ఆరోగ్యం, హాజరు, లెర్నింగ్ కెపాసిటీ మెరుగుపడుతుందన్నారు. అవసరాన్ని బట్టి ఎంపిక చేసిన జూనియర్ కళాశాలలకు మధ్యాహ్న భోజనాన్ని విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. గడ్డిపల్లి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను రూ.200 కోట్లతో నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 105 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని, గ్రామీణ విద్యార్థులకు ప్రముఖ పాఠశాలలతో సమానమైన విద్య, వసతి, క్రీడా సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్. పద్మావతిరెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

