DGP Shivadhar Reddy Letter to Police: ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు మనసులో అవినీతి ఆలోచనలకు చోటు ఉండకూడదని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి లేఖ రాశారు. పోలీస్ యూనిఫామ్, అవినీతి రెండూ కలిసి ఉండలేవని పేర్కొన్నారు. ఇటీవల శంషాబాద్‌లో సీఐ, ఎస్సై రూ. 33 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నేపథ్యంలో డీజీపీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అవినీతికి పాల్పడే పోలీసు అధికారులపై డీజీపీ శివధర్ రెడ్డి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 7న శంషాబాద్ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ పరిధిలో లంచం తీసుకుంటూ ఎస్సై, సీఐలు ఏసీబీకి దొరికిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
‘ఖాకీ డ్రెస్ వేసుకుని అవినీతికి పాల్పడటం సాధ్యం కాదు. అలాంటి వారు శాఖలో ఉండటానికి అనర్హులు. హోంగార్డ్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్కరూ పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేయాలి. పోలీస్ స్టేషన్లను సివిల్ వివాదాల సెటిల్మెంట్లకు వేదికలుగా మార్చవద్దు. చట్టం పరిధిలోనే పని చేయాలి. పోలీసు శాఖ ఎప్పుడూ నిష్పక్షపాతంగా, దృఢంగా, స్నేహపూర్వకంగా, వృత్తిపరంగా ఉండాలి.’ అని డీజీపీ లేఖలో పేర్కొన్నారు.
ఎవరైనా పోలీసులు లంచం అడిగితే 1064 అనే నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు డీజీపీ సూచించారు.

