HomeతెలంగాణDharpally: 100 పడకల ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

Dharpally: 100 పడకల ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ధర్పల్లి, నవంబర్ 5 (తెలుగు ప్రభ): ధర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పనులను డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. తుది దశ పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా చేపట్టాలని సూచించారు.

- Advertisement -

ధర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 30 పడకల నుంచి 100 పడకల స్థాయికి పెంచుతూ ప్రభుత్వం ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసింది. ఇందుకోసం రూ.33.15 కోట్ల నిధులతో అధునాతన వసతులతో కూడిన నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో వాటి నాణ్యతను తనిఖీ చేశారు. ఇంకా చేపట్టాల్సిన తుది దశ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

మాతా శిశు, పీడియాట్రిక్ విభాగాలు, క్యాజువాలిటీ, రేడియాలజీ, ఆపరేషన్ థియేటర్లు, ఆయుష్ బ్లాక్, పురుషులు, మహిళల వార్డులు, ఆప్తాల్మిక్, డెంటల్, డయాగ్నస్టిక్ తదితర విభాగాలను కలెక్టర్ సందర్శించారు. ఆయా విభాగాల్లో జరుగుతున్న పనుల నాణ్యతను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

తుది దశ పనులను వైద్యారోగ్య శాఖ అధికారులు క్రమం తప్పకుండా పరిశీలిస్తూ పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని విభాగాల నిర్మాణాలు, నిర్దేశించిన సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయో లేదో నిర్ధారించుకున్న తర్వాతే ఆసుపత్రిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కలెక్టర్ వెంట ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, స్థానిక తహసీల్దార్ శాంత, టీజీఎంఐడీసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News