- రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా అసంపూర్తి ప్రాజెక్టులే
- పాలమూరు ప్రాజెక్టుపై 90 శాతం పనులని చెప్పడం పచ్చి అబద్ధం
- కాళేశ్వరం బ్యారేజీలను శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరిస్తాం
- కేసీఆర్ పాదయాత్ర చేయడం కంటే ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం బెటర్
- నదీజలాల హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
- మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (తెలుగుప్రభ): తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న నీటి సమస్యకు ఒకవైపు ఎల్‌నినో ప్రభావం కారణమైతే, మరోవైపు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగంలో చోటుచేసుకున్న వైఫల్యాలు ప్రధాన కారణమని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సోమవారం శాసనసభ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ రైతుల కష్టాలకు ఇద్దరే కారణం.. ఒకరు మిస్టర్ ఎల్‌నినో.. మరొకరు మిస్టర్ కేసీఆర్’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రకృతి ప్రతికూల పరిస్థితులకు గత ప్రభుత్వ అసమర్థ సాగునీటి విధానాలు తోడవడంతోనే రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చిందన్నారు. నీటి లభ్యత తగ్గే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, నీటి వసతి అనిశ్చితంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు ప్రభుత్వం సూచించిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జనసమీకరణకు కేసీఆర్ సిద్ధమవుతున్నారన్న ప్రచారంపై మంత్రి ఉత్తమ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘పాదయాత్ర చేయడం కంటే కేసీఆర్ ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం బెటర్’ అని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయి ప్రాజెక్టు భద్రతే ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో అక్కడికి ప్రజలను తీసుకెళ్లి ఏం చూపిస్తారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టు దెబ్బతిన్న దృశ్యాలను చూపించడానికే ప్రజలను తీసుకెళ్తారా? అని నిలదీశారు. ప్రతిపక్షాల పాదయాత్రలకు, రాజకీయ కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడదని స్పష్టం చేస్తూనే, కాళేశ్వరం దుస్థితికి కారణాలపై ముందుగా తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో భాషా ప్రమాణాలు దిగజారడానికి కేసీఆర్‌నే కారణమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అయితే బీఆర్‌ఎస్‌పై తమ ప్రధాన విమర్శ రాజకీయ భాషకు మాత్రమే పరిమితం కాదని, సాగునీటి రంగంలో ఆ పార్టీ ప్రభుత్వం చేసిన వైఫల్యాలే అసలు సమస్య అని స్పష్టం చేశారు.
లక్షల కోట్లు ఖర్చు చేసినా అసంపూర్తి ప్రాజెక్టులే
తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సాగునీటి రంగంపై సుమారు రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, రాష్ట్ర ఆవిర్భావ సమయానికి పెండింగ్‌లో ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్కదానినీ పూర్తిస్థాయిలో పూర్తి చేయలేకపోయారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వంటి కీలక ప్రాజెక్టులు భారీగా నిధులు వెచ్చించినా అసంపూర్తిగానే మిగిలిపోయాయని అన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్‌ఈసీ తదితర సంస్థల నుంచి అధిక వడ్డీలకు భారీగా రుణాలు తీసుకుని, ఆ అప్పుల భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపారని ఆరోపించారు. రూ.27,500 కోట్లు ఖర్చు చేసిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తయిందని చెప్పడం పచ్చి అబద్ధమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి అనేక సాగునీటి ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేసిన బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.
డిండి పనులకు రూ.1,800 కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిండి ప్రాజెక్టుకు నీటి వనరును ఖరారు చేయడంతోపాటు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు సుమారు రూ.1,800 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణను దేశీయ, అంతర్జాతీయ నిపుణుల సూచనల మేరకు చేపడుతున్నామని చెప్పారు. నిపుణుల పరిశీలనల్లో బ్యారేజీల పునాదులు, నిర్మాణ వ్యవస్థలకు సంబంధించి తీవ్రమైన లోపాలు వెలుగుచూశాయని తెలిపారు. డయాఫ్రం వాల్స్, స్టిల్లింగ్ బేసిన్ వ్యవస్థల మెరుగుదలతోపాటు బ్యారేజీల దీర్ఘకాలిక భద్రతకు అవసరమైన చర్యలను ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై పడిందని పేర్కొన్నారు.
ప్రాధాన్య క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి
2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రాణహిత – చేవెళ్ల, జూరాల ఆధారిత పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, ఎస్‌ఎల్‌బీసీ, డిండి, గౌరవెల్లి వంటి ప్రాజెక్టులను తక్కువ వ్యయంతో పూర్తి చేసి ఉండేవారమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన మూడు సంవత్సరాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకున్నామని తెలిపారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ విచారణల సందర్భంగా స్వయంగా ఢిల్లీ వెళ్లి న్యాయవాదులు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ తెలంగాణ వాదనను బలంగా వినిపించేందుకు చర్యలు తీసుకున్నానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధాన పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. కాళేశ్వరం బ్యారేజీలను నిపుణుల సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరిస్తామని తెలిపారు. తెలంగాణ నదీజల హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చిచెప్పారు.

