Mayor, Deputy Mayors Election: తెలంగాణ పురపాలక ఎన్నికల తుది ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి అత్యంత కీలకమైన మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియను అధికారులు నేడు చేపట్టనున్నారు. ముందుగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం పరోక్ష పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికను నిర్వహించనున్నారు.
పారదర్శకత కోసం కీలక నిబంధనలు: మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం కీలక నిబంధనలను అమలు చేస్తోంది. ఓటింగ్ ప్రక్రియలో గోప్యత లేకుండా, సభ్యులు తమ మద్దతును బహిరంగంగా చేతులెత్తడం ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలు ఇప్పటికే తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. దీంతో పార్టీ సూచించిన అభ్యర్థికే ఓటు వేయాల్సి ఉంటుంది. విప్ ఉల్లంఘించిన వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది.
Also read-TG SEC: ఈసీ సంచలన సర్క్యులర్.. రాజకీయ పార్టీల్లో టెన్షన్!
కీలకం కానున్న ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు: స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇది మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది. మెజారిటీ స్పష్టంగా ఉన్న చోట ఎన్నిక ఏకపక్షంగా సాగనుండగా హంగ్ ఏర్పడిన చోట ఎక్స్ అఫీషియో ఓట్లు మరియు ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది. కౌన్సిల్ హాల్స్ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం కల్లా రాష్ట్రంలోని కొత్త మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎవరో స్పష్టత రానుంది.

