HomeతెలంగాణK.S. Gopal: ప్రముఖ పర్యావరణవేత్త కె.ఎస్. గోపాల్ కన్నుమూత.. బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

K.S. Gopal: ప్రముఖ పర్యావరణవేత్త కె.ఎస్. గోపాల్ కన్నుమూత.. బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

environmentalist K.S. Gopal passes away: గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ పర్యావరణవేత్త, గ్రామీణాభివృద్ధి కార్యకర్త, డైరెక్టర్ కొమండూరి సంతోష గోపాల్ (కె.ఎస్. గోపాల్) ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య రామా రాజగోపాల్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కె.ఎస్. గోపాల్ సుస్థిర వ్యవసాయం, నీటి సంరక్షణ, గ్రామీణ జీవనోపాధి రంగాల్లో చేసిన సేవలకు గానూ జాతీయ స్థాయిలో అనేక అవార్డులు లభించాయి. ముఖ్యంగా నీటి కొరత, కరువు ప్రభావిత ప్రాంతాల్లో రైతులతో కలిసి పనిచేస్తూ పర్యావరణహిత, వాతావరణ మార్పులకు అనుకూలమైన వ్యవసాయ విధానాలకు ఆయన బాటలు వేశారు. ఆయన అభివృద్ధి చేసిన “సిస్టమ్ ఆఫ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ రీజువెనేషన్ (SWAR)” సాగునీటి విధానం విశేషంగా ప్రాచుర్యం పొందింది. ఈ విధానంలో విద్యుత్ అవసరం లేకుండా గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీటిని నేరుగా మొక్కల వేర్ల ప్రాంతానికి చేరవేయవచ్చు. తద్వారా నీటి వృథా గణనీయంగా తగ్గడంతో పాటు నేల ఉప్పుదనం తగ్గి, నేలలో సూక్ష్మజీవుల వృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. SWAR విధానం దేశీయంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకుంది. పారిస్, వాషింగ్టన్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ అవార్డులు సాధించిన ఈ సాంకేతికతను పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసే అనేక మంది రైతులు ఉపయోగిస్తున్నారు.

- Advertisement -

Also read: Petrol price increase: సామాన్యుడిపై మరోసారి పెట్రో బాంబు.. ఈసారి ఏకంగా రూ. 10 పెరిగే ఛాన్స్‌..!

స్వచ్ఛంద సంస్థల స్థాపనలో కీలక పాత్ర..

గ్రామీణాభివృద్ధి రంగంలో కూడా గోపాల్ విశేష కృషి చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) అమలుపై అధ్యయనం చేసి, గ్రామీణ జీవనోపాధి, సహజ వనరుల పరిరక్షణకు దోహదపడే విధానాలను కనుగొన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే స్థిరమైన వ్యవసాయ విధానాలు, స్థానిక నీటి నిర్వహణ, జీవపదార్థాల ఆధారిత నేల పునరుజ్జీవనం అవసరమని గుర్తించారు. పర్యావరణం, గ్రామీణాభివృద్ధి కోసం పనిచేసే పలు స్వచ్ఛంద సంస్థల స్థాపనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. కె.ఎస్. గోపాల్ అకాల మరణం పర్యావరణ ఉద్యమం, స్థిరమైన వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు. ఆయన ఆలోచనలు, సేవలు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, పర్యావరణవేత్తలకు ఎంతగానో మేలు చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News