Aroori Ramesh joined BRS party: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త చేరికలతో గులాబీ పార్టీ జోరుమీదుంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి తన సొంత గూటికి చేరారు. నేడు ఆరూరి రమేష్‌తో పాటు వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఫిబ్రవరిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్.. తర్వాత మూడోసారి ఓటమిని చవిచూశారు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. కొంతకాలానికి కమలం పార్టీపై అసంతృప్తితో తిరిగి తన సొంత గూటికి చేరుకున్నారు. ఈ మేరకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి రమేష్ నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు స్వాగతం పలికారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/vemulawada-temple-earns-record-income/
దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ అని హరీశ్ రావు అన్నారు. ఆరూరీ రమేష్ తనకు మంచి మిత్రుడు.. రమేష్‌తో అనుబంధం స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నిక నుంచే ఉందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం కేసీఆర్ వైపే చూస్తోందని.. కేసీఆర్ అంటే నమ్మకం, భరోసా అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో ప్రజలకు భద్రత, భరోసా లేదని.. కేసీఆర్ హయంలో యూరియా కొరత లేదని పేర్కొన్నారు.
‘రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైంది. రైతు బంధు పడుతుందో లేదో చెప్పే దిక్కు లేదు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ప్రతి రాత్రి భయపడుతూ నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ హయంలో ప్రతి సంవత్సరం 2 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేవారు. కాంగ్రెస్ సర్కార్ ఒక్క రూపాయి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేదు.’- హరీశ్ రావు
Also Read: https://teluguprabha.net/telangana-news/vemulawada-temple-earns-record-income/
ఆరూరి రమేష్ బీఆర్ఎస్‌లోకి వస్తున్నారు అంటేనే మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవదని అర్ధమైందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని.. వర్ధన్నపేటలో మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్‌కు బహుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను సవరించాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని హరీశ్ రావు వివరించారు.

