Kavitha Comments: తెలంగాణ వచ్చినా ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కవిత మాట్లాడారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల వైపే ధర్మం ఉందని, వారి కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యమ సోయి లేని రేవంత్ రెడ్డి సీఎం కావడం తెలంగాణ చేసుకున్న దౌర్భాగ్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పదేళ్లు బీఆర్ఎస్‌కు అధికారం ఇచ్చినా చేదు జ్ఞాపకాలే మిగిలాయని.. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా గన్ పట్టుకున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు అధికారం ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని భావించామని కవిత గుర్తు చేశారు. కానీ రాష్ట్రం వచ్చాక తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు.
అందుకే నమ్మాం..
‘ప్రొఫెసర్ కోదండరామ్, ఆకునూరి మురళి వంటివారు రేవంత్ రెడ్డితో కలవడంతోనే మేము కాంగ్రెస్‌ను నమ్మాము. కానీ రెండున్నరేళ్లుగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడటం లేదు. రాష్ట్ర బడ్జెట్‌లో హామీలకు సంబంధించిన నిర్ణయాలు లేకపోతే కోదండరామ్‌ను ప్రశ్నిస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేర్చాలి. హామీలు నెరవేర్చకపోతే ఊరుకోం. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల వైపే ధర్మం ఉంది. వారి కోసం పోరాటం చేస్తాం.’ అని కవిత స్పష్టం చేశారు.
సహనశీలత లేకపోవడం, అహంకారం కారణంగానే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని కవిత అన్నారు. మంచితనం, భోళాతనం తెలంగాణ తత్వమని అవి కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్టేనని హితవు పలికారు. జయశంకర్ సార్ విగ్రహం కేబీఆర్ పార్క్‌లో లేదా ట్యాంక్ బండ్‌పై పెట్టాలని అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ని ఎన్నోసార్లు అభ్యర్థించినా అది సాధ్యం కాలేదని వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు పెట్టుకోలేకపోయామని.. కనీసం ఆంధ్రా వాళ్ల విగ్రహాలు తీస్తారంటే అది కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడొచ్చిన ముఖ్యమంత్రి ఎవరి విగ్రహాలు పెడుతున్నారో చూస్తున్నాం కదా అని ఎద్దేవా చేశారు.
బిల్లు పాస్ చేయాలి..
ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ వాసులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పాస్ చేయాలని.. ఇందుకోసం తెలంగాణ జాగృతి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉద్యమకారులు ఉన్నారని.. వారి కోసం యాప్ లాంచ్ చేశామని అందులో వివరాలు నమోదు చేయాలని కవిత సూచించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రకటనపై కవిత స్పందించారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతామని.. అది పక్కా రాజకీయ పార్టీ కాదని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ అని తెలిపారు.

