HomeతెలంగాణMedak Fire Accident: కంటైనర్‌ లారీలో భారీగా ఎగిసిపడ్డ మంటలు.. అందులోని ఎనిమిది కార్లు దగ్ధం..!

Medak Fire Accident: కంటైనర్‌ లారీలో భారీగా ఎగిసిపడ్డ మంటలు.. అందులోని ఎనిమిది కార్లు దగ్ధం..!

Fire Accident at Medak National Highway: మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తూప్రాన్ సమీపంలో జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-44)పై ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ ఆస్తినష్టం వాటిల్లింది. మహారాష్ట్ర వైపు నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఈ కంటైనర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సదరు కంటైనర్ లారీలో కొత్తగా విక్రయానికి తరలిస్తున్న 8 మారుతీ సుజుకి కార్లు ఉన్నాయి. మంటలు క్షణాల్లో కంటైనర్ అంతటా విస్తరించడంతో, అందులోని ఎనిమిది కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు ఎగిసిపడటంతో అటు వైపుగా వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

- Advertisement -

Also read: Cockroach Janata Party: ట్రెండింగ్‌లో కాక్రోచ్ జనతా పార్టీ.. దేశంలో జెన్‌ జెడ్‌ ఉద్యమం మొదలైందా?

జాతీయ రహదారిపై భారీగా స్థంభించిన ట్రాఫిక్..

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఫైరింజన్‌తో మంటలను అదుపులోకి తెచ్చారు. లారీలో సాంకేతిక లోపం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై (హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో) భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తాత్కాలికంగా నిలిపివేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, మంటలు వ్యాపించిన వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ బయటకి దూకి సురక్షితంగా బయటపడ్డారు. వారికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. క్రేన్ల సహాయంతో రోడ్డుపై ఉన్న లారీ శిథిలాలను తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News