HomeతెలంగాణPromotions of Firemen: సీనియారిటీకి సంకెళ్లు.. పదోన్నతులకు అడ్డంకులు

Promotions of Firemen: సీనియారిటీకి సంకెళ్లు.. పదోన్నతులకు అడ్డంకులు

  • ఫైర్‌మెన్ల ప్రమోషన్లపై జీవో 86 ప్రభావం
  • రెండేళ్ల హెచ్‌ఎంవీ అనుభవ నిబంధనపై అభ్యంతరాలు
  • ఇంక్రిమెంట్లు, సర్వీసుపై దుష్ప్రభావం అంటున్న ఉద్యోగులు
  • రాష్ట్రవ్యాప్తంగా 1,800 మందికి నష్టం జరిగే ప్రమాదమని వాదన
  • పాత పదోన్నతి విధానాన్ని కొనసాగించాలని సర్కార్‌కు అగ్నిమాపక సిబ్బంది వినతి

మెట్‌పల్లి, అక్టోబర్‌ 17 (తెలుగుప్రభ): ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడే అగ్నిమాపక శాఖ ఉద్యోగులకు ఇప్పుడు పదోన్నతుల నిబంధనలు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్‌ నంబర్‌ 86 తమ సర్వీసు భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని ఫైర్‌మెన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి చేసిన సేవకు తగిన గుర్తింపు లభించకపోవచ్చని, సీనియారిటీ దెబ్బతినడంతో పాటు డ్రైవింగ్‌ అర్హతలకు సంబంధించిన నిబంధనలు పదోన్నతులకు అడ్డంకిగా మారవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,800 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాత పదోన్నతి విధానాన్ని కొనసాగించాలని, లేదంటే కొత్త నిబంధనలను భవిష్యత్తులో నియామకమయ్యే ఉద్యోగులకే వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం గత ఏడాది జూలై 11న జారీ చేసిన జీవో 86తో సర్వీసు నిబంధనల్లో వచ్చిన మార్పులు తమ ఉద్యోగ భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ముఖ్యంగా డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుకు సంబంధించిన అర్హతలు, పదోన్నతుల క్రమంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమల్లో ఉన్న రెండేళ్ల హెచ్‌ఎంవీ డ్రైవింగ్‌ అనుభవ నిబంధనలో మార్పులు చేయడం, ఫైర్‌మెన్‌ నుంచి పైస్థాయి హోదాలకు వెళ్లే మార్గంలో మార్పులు రావడం తమ అవకాశాలను ప్రభావితం చేయవచ్చని పేర్కొంటున్నారు. ఈ అంశాలపై స్పష్టత ఇచ్చి, నిబంధనలను పునఃపరిశీలించాలని కోరుతున్నారు.

- Advertisement -

పాత నిబంధనలకు.. కొత్త జీవోకు మధ్య తేడా
అగ్నిమాపక శాఖలో గతంలో అమల్లో ఉన్న జీవో 568 ప్రకారం కొనసాగిన పదోన్నతుల విధానానికి, కొత్తగా జారీ చేసిన జీవో 86కు మధ్య కీలకమైన మార్పులు ఉన్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. పాత విధానంలో ఫైర్‌మెన్‌ నుంచి లీడింగ్‌ ఫైర్‌మెన్‌ హోదాకు పదోన్నతి పొందే మార్గం ఉండేదని.. సర్వీసు అర్హతలు, సీనియారిటీ, ఖాళీల ఆధారంగా అవకాశాలు లభించేవని వివరిస్తున్నారు. కొత్త సర్వీసు నిబంధనలతో డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుకు సంబంధించిన అర్హతలు, పదోన్నతుల క్రమం మారడం వల్ల ఇప్పటికే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల అవకాశాలపై ప్రభావం పడవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు, సీనియారిటీ, ఇంక్రిమెంట్ల విషయంలో పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో డ్రైవర్‌ ఆపరేటర్‌ నియామకాలకు హెచ్‌ఎంవీ లైసెన్స్‌ను కనీసం రెండేళ్లపాటు నిరంతరంగా కలిగి ఉండాలనే అర్హత ఉండేదని ఉద్యోగులు వివరిస్తున్నారు. భారీ వాహనాలను నడపడంలో నైపుణ్యం, వాహనాల నిర్వహణపై అవగాహన, చిన్నపాటి మరమ్మతులు, విడిభాగాల మార్పు వంటి అంశాల్లో అనుభవం పొందేందుకు ఈ నిబంధన ఉపయోగపడేదని చెబుతున్నారు. కొత్త జీవోతో రెండేళ్ల అనుభవానికి సంబంధించిన నిబంధన తొలగిపోయిందని వారు పేర్కొంటున్నారు. దీనివల్ల భారీ అగ్నిమాపక వాహనాలను నడపడంలో అవసరమైన అనుభవం ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

14 ఏళ్ల సర్వీసు తర్వాతే పదోన్నతా?
ఫైర్‌మెన్‌గా నియమితులైన ఉద్యోగులు లీడింగ్‌ ఫైర్‌మెన్‌గా పదోన్నతి పొందేందుకు 14 నుంచి 15 ఏళ్లు వేచి చూడాల్సి వస్తుందనే వాదన సరైంది కాదని ఉద్యోగులు అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా 2011 బ్యాచ్‌కు చెందిన పలువురు ఫైర్‌మెన్లు లీడింగ్‌ ఫైర్‌మెన్లుగా పదోన్నతులు పొందారని, వారిలో కొందరు సుమారు 14 ఏళ్ల సర్వీసులోనే స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ హోదాకు చేరుకున్నారని చెబుతున్నారు. పాత రంగారెడ్డి జిల్లా పరిధిలో 2011 బ్యాచ్‌ ఉద్యోగులు నాలుగేళ్ల సర్వీసులోనే లీడింగ్‌ ఫైర్‌మెన్లుగా, ఆ తర్వాత మరో నాలుగేళ్లలో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్లుగా పదోన్నతులు పొందిన ఉదాహరణలు ఉన్నాయని పేర్కొంటున్నారు. కొత్త నిబంధనల అమలులో సీనియారిటీ మరో ప్రధాన సమస్యగా మారిందని ఉద్యోగులు చెబుతున్నారు. 2011, 2013, 2014, 2017, 2020 బ్యాచ్‌లకు చెందిన ఫైర్‌మెన్లు డ్రైవర్‌ ఆపరేటర్లుగా పదోన్నతి పొందితే, 2024 బ్యాచ్‌లో నేరుగా డ్రైవర్‌ ఆపరేటర్లుగా నియమితులైన ఉద్యోగులతో పోలిస్తే వారి సీనియారిటీని ఎలా నిర్ణయిస్తారనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. సీనియారిటీని కొనసాగించేందుకు కమిటీని నియమించినట్లు తమకు తెలిసిందని, అయితే ఆ కమిటీ సిఫారసులు కొత్త సర్వీసు నిబంధనల్లో ఏ విధంగా అమలయ్యాయనే అంశంపై స్పష్టత లేదని చెబుతున్నారు. దీనిపై శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.

ఇంక్రిమెంట్లపైనా ప్రభావమా?
పదోన్నతికి అవసరమైన అర్హతలు, సాధారణ వార్షిక వేతన వృద్ధికి వర్తించే నిబంధనలు వేర్వేరు అంశాలని ఉద్యోగులు పేర్కొంటున్నారు. హెచ్‌ఎంవీ లైసెన్స్‌ లేకపోవడం వల్ల ఇంక్రిమెంట్లు నిలిచిపోతున్నాయనే ఆందోళనలపై సంబంధిత సర్వీసు రూల్స్‌, శాఖ ఉత్తర్వులను పరిశీలించి స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. పదోన్నతి అర్హతలు, ఇంక్రిమెంట్లు, ఇతర సర్వీసు ప్రయోజనాలపై అధికారిక మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News