Salmon Reddy pass away: ప్రముఖ సామాజిక కార్యకర్త, పౌర హక్కుల నేత గాదె ఇన్నయ్య కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి మరణించిన కొద్దిరోజుల వ్యవధిలోనే తండ్రి గాదె సాల్మోన్ రెడ్డి శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ వరుస మరణాలతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
విషాదంలో కుటుంబం: ప్రస్తుతం గాదె ఇన్నయ్య ఎన్‌ఐఏ (NIA) కేసులో రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. ఇటీవల ఆయన తల్లి మరణించిన సమయంలో కోర్టు ప్రత్యేక అనుమతితో పెరోల్‌పై వచ్చి ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తల్లిని కోల్పోయిన దుఃఖం నుండి కోలుకోకముందే.. ఇవాళ ఉదయం తండ్రి సైతం మరణించడంతో ఇన్నయ్య కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
తండ్రి అంత్యక్రియల కోసం మరోసారి పెరోల్?: సాల్మోన్ రెడ్డి మరణవార్త తెలుసుకున్న బంధుమిత్రులు, పౌర హక్కుల సంఘాల నేతలు వారి నివాసానికి చేరుకుంటున్నారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులు అంత్యక్రియలకు హాజరుకావాలని కుటుంబ సభ్యులు కోరారు. తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు గాదె ఇన్నయ్య మరోసారి కోర్టును ఆశ్రయించి, పెరోల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే నెలలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో గాదె ఇన్నయ్య కుటుంబ సభ్యులకు పలువురు సామాజిక కార్యకర్తలు, ఆత్మీయులు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.

