Education transforms tribal village : ఆ తండాలో ఒకప్పుడు వ్యవసాయమే జీవనాధారం.. సాగునీరు లేక, బతుకు బండి లాగలేక గల్ఫ్ దేశాలకు వలసలే శరణ్యం. కానీ, నేడు ఆ తండా తీరే మారింది. అక్కడి యువత కలం పట్టి, పుస్తకాలు పట్టి, సర్కారీ కొలువులను కొల్లగొడుతున్నారు. జగిత్యాల జిల్లాలోని ఓ మారుమూల గిరిజన తండా, నేడు ‘ఉద్యోగుల అడ్డా’గా మారింది. చదువుతోనే తలరాతలు మారతాయని నిరూపించిన ఆ స్ఫూర్తిదాయక ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
జగిత్యాల జిల్లా, కొడిమ్యాల మండలంలోని గంగారాం తండా, పూర్తిగా అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఓ చిన్న గిరిజన గ్రామం. 780 మంది జనాభా ఉన్న ఈ తండాలో, ఒకప్పుడు సాగునీటి వసతి లేక, చాలా కుటుంబాలు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవి. కానీ, కాలక్రమేణా, ఆ తండా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. “చదువుతోనే మన బతుకులు బాగుపడతాయి” అని విశ్వసించి, కష్టపడి తమ పిల్లలను చదివించారు.
కొలువుల జాతర : తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఆ తండా యువత చదువులో రాణిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాలను సాధిస్తున్నారు.
28 మంది ప్రభుత్వ ఉద్యోగులు: ఈ చిన్న తండా నుంచి ఇప్పటివరకు ఏకంగా 28 మంది ప్రభుత్వ, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరిలో ఆరుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు పోలీసులు, ముగ్గురు విద్యుత్ శాఖ లైన్‌మెన్లు, ఇద్దరు పోస్టల్ శాఖ ఉద్యోగులు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ తండాలో 60 మందికి పైగా పట్టభద్రులు ఉండటం, మరో 12 మంది బీటెక్ చదువుతుండటం, విద్యపై వారికున్న తపనకు నిదర్శనం.
స్ఫూర్తి గాథలు.. వారి మాటల్లోనే
“అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోయారు. కష్టపడి చదువుకుని, 2008లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. ఆ తర్వాత కూడా చదువు ఆపకుండా, ఎస్జీటీగా, టీజీటీగా ఎంపికయ్యాను. ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను.”
– లావుడ్య జైల్‌సింగ్, ఉపాధ్యాయుడు
“2000 సంవత్సరంలో ఈ గ్రామం నుంచి ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం సాధించిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. నేను చదువుకున్న బడిలోనే వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేయడం గర్వంగా ఉంది.”
– లావుడ్య బన్సీలాల్, వ్యాయామ ఉపాధ్యాయుడు
ఈ ఉద్యోగులే ఇప్పుడు తండాలోని మిగతా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం 20 మందికి పైగా యువతీ యువకులు, వీరిని ఆదర్శంగా తీసుకుని, ప్రభుత్వ కొలువుల కోసం తీవ్రంగా సన్నద్ధమవుతున్నారు. ఒకప్పుడు వలసలతో వెలవెలబోయిన గంగారాం తండా, నేడు చదువుల కాంతులతో, కొలువుల వెలుగులతో కళకళలాడుతోంది.

