Annual e-KYC for LPG subsidy : మీ గ్యాస్ సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాలో పడటం లేదా? నెలలు గడుస్తున్నా రాయితీ జమ కాక, గ్యాస్ ఏజెన్సీకి వెళ్తే బ్యాంకుకు, బ్యాంకుకు వెళ్తే ఏజెన్సీకి తిప్పుతున్నారా? అయితే ఈ గందరగోళానికి అసలు కారణం ఇదే. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వంటగ్యాస్ రాయితీ నిరంతరాయంగా పొందాలంటే, వినియోగదారులు ఇకపై తప్పనిసరిగా ప్రతీ ఏటా ఒక ముఖ్యమైన ప్రక్రియను పూర్తి చేయాల్సిందే. అదే ‘ఈ-కేవైసీ’. అసలు ఈ-కేవైసీ ఎందుకు తప్పనిసరి చేశారు? దీన్ని ఎలా పూర్తి చేయాలి? గడువు ఎప్పటిలోగా? ఒకవేళ పూర్తి చేయకపోతే ఏమవుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇక్కడ ఉన్నాయి.
గడువు దాటితే.. రాయితీ శాశ్వతంగా రద్దు : వంటగ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు (హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం) అతి ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రభుత్వ రాయితీ పొందుతున్న ప్రతి ఒక్కరూ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో ఒకసారి బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ (e-KYC) తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ప్రక్రియను మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయాలి. ఈ గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి సబ్సిడీ శాశ్వతంగా రద్దు అవుతుందని కంపెనీలు తేల్చి చెప్పాయి. కేంద్రం ఏడాదికి గరిష్ఠంగా 9 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ ఇస్తోంది. ముఖ్యంగా 8, 9వ సిలిండర్లకు సబ్సిడీ విడుదల చేయటానికి ముందు ఈ-కేవైసీ ధ్రువీకరణను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ధ్రువీకరణలో జాప్యం జరిగితే, ఆ మొత్తం తాత్కాలికంగా నిలిచిపోతుంది, గడువు దాటితే పూర్తిగా రద్దవుతుంది.
ఈ-కేవైసీ పూర్తి చేయడానికి మూడు సులభ మార్గాలు : వినియోగదారుల సౌలభ్యం కోసం ఆయిల్ కంపెనీలు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి మూడు మార్గాలను అందుబాటులోకి తెచ్చాయి. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కె. జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన ప్రకారం, వినియోగదారులు తమకు అనువైన పద్ధతిని ఎంచుకోవచ్చు.
కంపెనీ మొబైల్ యాప్ ద్వారా: మీరు వినియోగిస్తున్న గ్యాస్ కంపెనీకి చెందిన అధికారిక మొబైల్ యాప్‌ను (My HP Gas, IndianOil One, Hello BPCL) డౌన్‌లోడ్ చేసుకుని, అందులోని సూచనలను పాటిస్తూ మీ ఆధార్ బయోమెట్రిక్‌తో సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు.
గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో: మీకు సమీపంలో ఉన్న మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి నేరుగా వెళ్లి, అక్కడి సిబ్బంది సహాయంతో మీ బయోమెట్రిక్ ధ్రువీకరణను పూర్తి చేసుకోవచ్చు.
డెలివరీ బాయ్ సహాయంతో: సిలిండర్ డెలివరీ చేసే సిబ్బంది వద్ద కూడా ఈ-కేవైసీ చేసేందుకు అవసరమైన బయోమెట్రిక్ పరికరం, యాప్ అందుబాటులో ఉంటుంది. సిలిండర్ వచ్చినప్పుడు వారి ద్వారా కూడా ఈ ప్రక్రియను అక్కడికక్కడే పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియపై మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ http://www.pmuy.gov.in/e-kyc.html ను సంప్రదించవచ్చు.
తెలంగాణలో పరిస్థితి – అంకెల అద్దంలో : రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, రేషన్ కార్డుల ఆధారంగా దాదాపు 39.57 లక్షల మంది సబ్సిడీకి అర్హులుగా ఉన్నారు. వీరందరికీ రాయితీ అందించేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.855.22 కోట్లు కేటాయించింది. అయితే గత మూడు నెలలుగా చాలా మంది వినియోగదారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వ రాయితీ జమ కాకపోవడానికి ప్రధాన కారణం ఈ-కేవైసీ పూర్తి చేయకపోవడమేనని స్పష్టమవుతోంది.

