HomeతెలంగాణControversy : కుక్కల క్షవరానికి కోట్ల స్థలం.. బల్దియా బాగోతం!

Controversy : కుక్కల క్షవరానికి కోట్ల స్థలం.. బల్దియా బాగోతం!

GHMC land allotment controversy : హైదరాబాద్ నడిబొడ్డున, అంగుళం భూమికి వేలు, లక్షలు పలికే అత్యంత ఖరీదైన ప్రాంతం కేబీఆర్ (KBR) పార్క్. అలాంటి చోట ఏకంగా రూ.5 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం కుక్కలకు క్షవరం చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థకు కారుచౌకగా ఇచ్చేస్తే? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఘనత ఇది. సమాజ సేవ చేసే సంస్థలకో, ప్రజా ప్రయోజనార్థం చేపట్టే ప్రాజెక్టులకో కాదు.. పెంపుడు కుక్కలకు స్నానాలు చేయించి, మసాజ్ చేసే ‘పెట్ ఫోక్’ (Petfolk) అనే ప్రైవేట్ సంస్థ కోసం బల్దియా బాస్‌లు నిబంధనలను బుట్టదాఖలు చేశారు. 

- Advertisement -

స్థలం ఖరీదు ఆకాశంలో.. అద్దె పాతాళంలో : సాధారణంగా కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్ వాణిజ్య భవనాల్లో అద్దె చదరపు అడుగుకు నెలకు రూ.200 పైనే పలుకుతుంది. కానీ, జీహెచ్ఎంసీ అధికారులు గేట్ నంబర్ 5 వద్ద ఉన్న 900 చదరపు అడుగుల అత్యంత ఖరీదైన స్థలాన్ని ‘పెట్ ఫోక్’ కు అప్పనంగా కట్టబెట్టారు. ఈ రూ.5 కోట్ల విలువైన స్థలానికి వారు నిర్ణయించిన అద్దె ఎంతో తెలుసా? నెలకు కేవలం రూ.15,000! అంటే చదరపు అడుగుకు సుమారు 16 రూపాయలన్నమాట. కనీస మార్కెట్ విలువను సైతం పరిగణనలోకి తీసుకోకుండా, బల్దియా ఆదాయానికి గండికొడుతూ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

వేలానికి మంగళం.. పెట్ ఫోక్‌కు పెద్దపీట : ప్రభుత్వ స్థలాలను వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలంటే ‘బహిరంగ వేలం’  తప్పనిసరి. కేబీఆర్ పార్క్ నడక దారి (వాకింగ్ ట్రాక్) పొడవునా గతంలో ఏర్పాటు చేసిన దుకాణాలకు టెండర్లు పిలిచి వేలం ద్వారానే ఇచ్చారు. కానీ ఈ కుక్కల మసాజ్ సెంటర్‌కు మాత్రం వేలం వేస్తే అద్దె ఎక్కువవుతుందన్న విచిత్రమైన నెపంతో, అధికారులే అడ్డదారి తొక్కారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘం  సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ భూకేటాయింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడం గమనార్హం. వేలం నిబంధనను ఎందుకు తుంగలో తొక్కారని అడిగితే, కమిషనర్ వద్ద సమాధానం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

పాలకమండలి లేక.. అధికారుల ఇష్టారాజ్యం : జీహెచ్ఎంసీ పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 11వ తేదీన ముగిసింది. అంతకుముందు మేయర్, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో స్థాయీ సంఘం సమావేశాలు జరిగి, తీర్మానాలను పారదర్శకంగా, బహిరంగంగా వెల్లడించేవారు. కానీ పాలన స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్లాక పారదర్శకత లోపించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకమండలి లేని లోటును ఆసరాగా చేసుకుని, కోట్లాది రూపాయల ఆస్తులను అధికారులే గుట్టుగా, తమ ఇష్టానుసారం కేటాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వాకర్ల ఆవేదన అరణ్య రోదనేనా? : రోజువారీ వ్యాయామం, ఆహ్లాదం కోసం కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్లు జీహెచ్ఎంసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే కాలిబాట పక్కనే కుక్కల క్షవరశాల ఏర్పాటు చేస్తే, ఆ ప్రాంతమంతా పెంపుడు జంతువులు, వాటి యజమానుల వాహనాలతో నిండిపోతుందని, నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ నిబంధనల విరుద్ధ కేటాయింపును రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News