Good news for Anganwadi staff: మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్వాడీ సిబ్బంది విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వారి స్థానంలో ఇప్పటికే కొత్తగా ఎవరినీ తీసుకోని సందర్భంలో మాత్రమే పునర్నియామకానికి అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఆయాల విజ్ఞప్తులను పరిశీలించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.
Also Read: Mahesh Goud: త్వరలోనే లీకు వీరుల సంగతి తేలుస్తాం..! మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాం..
రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని మాతా, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క తెలిపారు. సిబ్బంది సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలు అందించే విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పాత్ర చాలా కీలకమని గుర్తు చేశారు. అందుకే, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కాగా, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనల మేరకు అంగన్వాడీ పోస్టులకు రాజీనామా చేశారు. వారిలో కొందరు ఓటమి పాలవ్వగా.. ఉన్న ఆ కాస్త ఉద్యోగం కూడా కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి సీతక్కను కలిసి విజ్ఞప్తి చేయగా.. ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

