Good news for government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. వేతనాల చెల్లింపులపై జరుగుతున్న ఆలస్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్‌ను జారీ చేసింది. కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ పరిధిలోని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అందరికీ కూడా ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వేర్వేరు తేదీల్లో జీతాలు రావడం వల్ల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున.. అందరికీ ఒకే తేదీనే జీతాలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఆలస్యమైతే హెచ్‌ఓడీ, డీడీఓలదే బాధ్యత..
జీతాల చెల్లింపు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ, ఏ శాఖలోనైనా 1వ తేదీన జీతాలు పడటంలో ఆలస్యమైతే అందుకు ఆయా శాఖల అధిపతులు (హెచ్‌ఓడీ), డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల (డీడీఓ)లదే పూర్తి బాధ్యత అని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. సకాలంలో బిల్లులు రికార్డు చేయని అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల ఉద్యోగులకు ఎలాంటి సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులు లేకుండా ఒకటో తేదీనే జీతాలు అందేలా చూసేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ, ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోనున్నారు. సీఎం రేవంత్ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

