Telangana RTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరువు భత్యాన్ని 2.1 శాతం పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉద్యోగులకు 50.7 శాతం డీఏ అందుతుండగా, తాజా పెంపుతో ఇది 52.8 శాతానికి చేరుకుంది. ఈ పెరిగిన డీఏ జనవరి 1, 2026 నుంచి అమలులోకి వస్తుందని మంత్రి పొన్నం తెలిపారు.
డీఏ పెంపు నేపథ్యంలో గత మూడు నెలలకు(జనవరి నుంచి మార్చి వరకు) సంబంధించిన డీఏ బకాయిలను రాబోయే మూడు నెలల్లో సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల సంస్థలో పనిచేస్తున్న 38 వేలకు పైగా సిబ్బందికి లబ్ధి చేకూరనుండగా.. ఆర్టీసీపై ప్రతి నెలా సుమారు రూ. 2.82 కోట్ల అదనపు భారం పడనుంది.
కాగా, గత ఏడాది జులైలో కూడా ప్రభుత్వం 2.1 శాతం డీఏ పెంచింది. తాజా పెంపుతో ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏల ప్రక్రియ పూర్తిగా పూర్తయినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. డీఏ పెంపు సందర్భంగా మంత్రికి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

