Sankranti holidays: పాఠశాల విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 025-26 విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను అనుసరించి.. రాష్ట్రంలోని అన్ని రకాల యాజమాన్యాల పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ గత మే నెలలో జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు.. ఐదు రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది. అయితే ఈ నిర్ణయాన్నీ పునఃసమీక్షించి.. వరుసగా వస్తున్న సెలవులను కలుపుతూ మొత్తం 7 రోజుల పాటు విద్యాశాఖ సెలవులను ప్రకటించింది. దీంతో విద్యార్థులు పండుగ ఆనందాలను పూర్తిగా ఆస్వాదించే అవకాశం దక్కింది.
సెలవుల వివరాలు ఇవే:
- సెలవుల కాలం: జనవరి 10వ తేదీ నుండి జనవరి 16వ తేదీ వరకు.
- పండుగ రోజు: జనవరి 15న సంక్రాంతి పండుగ.
- ఆప్షనల్ హాలిడే: జనవరి 16న కనుమను ఆప్షనల్ హాలిడేగా పేర్కొన్నారు.
సెలవులు పెరగడానికి కారణం: వాస్తవానికి విద్యాశాఖ గత మే నెలలో విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 15 వరకు ఐదు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వాలని భావించింది. అయితే జనవరి 10 రెండో శనివారం రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. గతేడాది సంక్రాంతి పండుగ కోసం కేవలం 6 రోజులు మాత్రమే సెలవులు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం అది 7 రోజులకు చేరడం విద్యార్థులకు పెద్ద ఊరటగా మారింది.
పల్లెబాట పట్టనున్న విద్యార్థులు: సుదీర్ఘ సెలవులు లభించడంతో విద్యార్థులు తమ సొంత గ్రామాలకు వెళ్లి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతాయి. కాబట్టి ఈ అదనపు సెలవులు పిల్లలకు పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయనున్నాయి. అయితే ఈ ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు.. విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ఇలా అన్ని పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

