Government issues orders to bring T-SAT: రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సమాచార సాంకేతిక, ప్రసారాల శాఖ పరిధిలో ఉన్న టీశాట్‌ను విద్యాశాఖకు బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా విద్యా సంబంధిత ప్రసారాలు, డిజిటల్ లెర్నింగ్ అంశాలు నేరుగా విద్యాశాఖ పర్యవేక్షణలోకి రానున్నాయి. టీశాట్‌ను విద్యాశాఖతో అనుసంధానించి, డిజిటల్ విద్య బోధనను మరింత విస్తృతం చేయనున్నారు. టీశాట్ ద్వారా ఉచిత నాణ్యమైన విద్యను డిజిటల్ విధానంలో విద్యార్థులకు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల వారికి చేరువ చేయనున్నారు.
Also read: https://teluguprabha.net/top-stories/meta-sensational-decision-on-layoffs/
పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచితంగా ఆన్‌లైన్ క్లాసులు..
ప్రస్తుతం, టీశాట్ పాఠశాల విద్య, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యా విషయాలతో పాటుగా పదో తరగతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందిస్తోంది. అదే మాదిరిగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచితంగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. టీశాట్ ద్వారా ఆన్ లైన్‌లో ఉచితంగా వేల కొద్ది పాఠాలు అందుబాటులో ఉన్నాయి. దీనిలో క్లాసులు వినడం ద్వారా వేలకు వేలు పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుండే పాఠాలు వినే సౌకర్యం ఉంది. శాటిలైట్, కేబుల్ నెట్వర్క్, ఓటీటీ వేదికల ద్వారా టీశాట్ ఇప్పటివరకు 4.8 మిలియన్ యూజర్లను చేరుకుని, దేశంలోనే విద్యా ప్రసార ఛానళ్లలో మొదటి స్థానాన్ని సాధించింది. ఇప్పుడు విద్యాశాఖ పరిధిలోకి రావడంతో టీశాట్ కార్యకలాపాలను ప్రభుత్వం మరింత విస్తృతం చేయనుంది.

