హైదరాబాద్ (తెలుగుప్రభ): తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డును ఎస్‌ఎస్‌సీ బోర్డులో విలీనం చేయవద్దని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జేఏసీ, తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్‌ఏ – 475) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. తెలంగాణ లెక్చరర్ల అసోసియేషన్ కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. మంగళవారం ఇంటర్ విద్యా డైరెక్టర్, బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ ఐఏఎస్‌ను కలిసి సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను అధికారికంగా వెల్లడించి, రాతపూర్వక పత్రాలను సమర్పించారు. ఇంటర్ బోర్డును ప్రత్యేకంగానే కొనసాగిస్తూ అవసరమైన సంస్కరణలు చేపట్టాలని కోరారు.
ఇంటర్‌కు ప్రత్యేక వ్యవస్థ అవసరం..
1969 నుంచి 10+2+3 విధానంలో కొనసాగుతున్న ఇంటర్ విద్యకు ప్రత్యేక బోర్డు ఉండటంతో ఏటా 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోందని సంఘాల ప్రతినిధులు తెలిపారు. జాతీయ, రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షలతో పాటు ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ తెలంగాణ ఇంటర్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేస్తే 11, 12 తరగతుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జనరల్, ఒకేషనల్ కోర్సులకు ప్రత్యేక నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉండటం వల్ల విద్యార్థులకు మెరుగైన బోధన అందుతోందన్నారు. ఇంటర్‌ను హైస్కూల్ వ్యవస్థలో విలీనం చేస్తే అధ్యాపకుల సేవలు, హైరార్కీ, సర్వీస్ నిబంధనలకు సంబంధించి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒకే విద్యా వాతావరణంలో చదివిన విద్యార్థులు ఇంటర్ దశలో ప్రత్యేక విద్యా వ్యవస్థలోకి అడుగుపెట్టడం కొత్త విద్యా దశకు మారిన భావన కలిగిస్తుందని, ఈ ప్రత్యేకతను కోల్పోతే విద్యార్థుల విద్యా నైపుణ్యాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కేంద్ర ఆధిపత్యం వద్దు..
జాతీయ విద్యా విధానం – 2020లోని కొన్ని అంశాలు ఆధునిక విజ్ఞానానికి భిన్నంగా ఉన్నాయని అధ్యాపకుల సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. జ్యోతిష్యం వంటి కోర్సులకు చోటు కల్పించడం సమంజసం కాదన్నారు. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఆర్థిక సాయం పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల విద్యావ్యవస్థపై పూర్తి స్థాయి నియంత్రణ సాధించడం సరికాదని పేర్కొన్నారు. భిన్న భాషలు, సంస్కృతులు, ఆచారాలు ఉన్న దేశంలో ఒకే విధమైన విద్యా విధానాన్ని అమలు చేయడం సరైన పద్ధతి కాదని, రాష్ట్రాలపై త్రిభాషా సూత్రాన్ని బలవంతంగా అమలు చేయవద్దని బోర్డు కార్యదర్శిని కోరారు.
ప్రైవేటు వర్సిటీలకు ప్రాధాన్యం వద్దు..
రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, దీంతో ఉన్నత విద్యా రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉన్నత విద్యలో ప్రైవేటు యూనివర్సిటీలకు ఎక్కువ అవకాశాలు కల్పించకుండా ప్రభుత్వ రంగంలోనే మరిన్ని విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరాయి. నాణ్యత పేరుతో కళాశాలల సంఖ్యను తగ్గించవద్దని సూచించాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రాధాన్యం పెరిగితే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య మరింత దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎంఫిల్ రద్దు, బీఈడీ కోర్సు కాలవ్యవధి పెంపు, డిగ్రీలో ఏడాది వారీగా సర్టిఫికెట్లు ఇవ్వడం వంటి మార్పులు పేద విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసే పరిస్థితికి దారితీయొచ్చని పేర్కొన్నారు.
పరీక్షలు రాష్ట్రాల పరిధిలోనే ఉండాలి..
ప్రవేశ పరీక్షలను పూర్తిగా కేంద్రీకరించడం వల్ల ఇటీవల నీట్, యూజీసీ–నెట్ పరీక్షల విషయంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల పరిధిలోని ప్రవేశ పరీక్షలను ఆయా రాష్ట్రాలే నిర్వహించుకునే అధికారం ఇవ్వాలని సంఘాల ప్రతినిధులు కోరారు. సంఘాల వారీగా సమర్పించిన అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఇంటర్ విద్యా డైరెక్టర్ హామీ ఇచ్చారు. బోర్డు కార్యదర్శిని కలిసిన వారిలో తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు జంగయ్య, జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, టీజీజేఎల్‌ఏ – 475 రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వి.శ్రీనివాస్, కార్యదర్శి డాక్టర్ కుప్పిశెట్టి సురేష్, తెలంగాణ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కనకచంద్రం తదితరులు ఉన్నారు.

