Saturday, February 14, 2026
HomeతెలంగాణAdi Srinivas: కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా?.. బీఆర్ఎస్ తీరుపై ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు

Adi Srinivas: కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా?.. బీఆర్ఎస్ తీరుపై ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు

Phone tapping investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న రాద్ధాంతంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని అన్నారు. విచారణకు హాజరు కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

విచారణకు పిలిస్తే గగ్గోలు ఎందుకు?: కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. “కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా? లేక మానవాతీతుడా? మహత్ముడా?” అని నిలదీశారు. గతంలో శిబు సోరెన్, జయలలిత, లాలు ప్రసాద్ యాదవ్, యడియూరప్ప వంటి దిగ్గజ నాయకులే జైలుకు వెళ్లిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. దీనికి ఎవరూ మినహాయింపు కాదని పేర్కొన్నారు.

తెలంగాణను భ్రష్టు పట్టించారు: అమరవీరుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను గత పదేళ్ల పాలనలో కేసీఆర్ సర్వనాశనం చేశారని విప్ మండిపడ్డారు. నీచమైన పనులతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినందుకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, చివరికి జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన దుర్మార్గపు ముఠాకు కేసీఆర్ నాయకుడని ఆయన ఆరోపించారు. గతంలో ట్యాపింగ్ జరగలేదని వాదించిన వారే.. ఇప్పుడు కవిత నోటి ద్వారా ట్యాపింగ్ నిజమేనని ఒప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి మీకూ సంబంధం ఏంటి?: కేసీఆర్‌ను విచారిస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లేనని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటంపై ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పార్టీ పేరులోనే తెలంగాణ అనే పదాన్ని తొలగించుకున్న రోజే ఈ గడ్డతో మీకున్న పేగు బంధం తెగిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మీకు ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. తెలంగాణ అంటే అమరవీరుల త్యాగమని అన్నారు. అది కేసీఆర్ కుటుంబానికి సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News