Bhatti Vikramarka Son’s Marriage: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో వివాహ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. భట్టి కుమారుడు సూర్య విక్రమాదిత్య- సాక్షిల పరిణయం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు.
రాజకీయ, వ్యాపార, సినీ రంగాల ప్రముఖుల రాకతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య వివాహం కన్నుల పండువగ జరిగింది. వివాహ వేడుకకు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులు సూర్య విక్రమాదిత్య- సాక్షిల జంటను ఆశీర్వదించారు. వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ కాసేపు ముచ్చటించారు.

Also Read: https://teluguprabha.net/telangana/police-arrest-accused-gangaraju-in-minor-girl-delivery-case/
ఈ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, గంగుల కమలాకర్, సినీ ప్రముఖులు చిరంజీవి, అక్కినేని నాగార్జున, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మరోవైపు భట్టి విక్రమార్క తనయుడి వివాహ వేడుకలో మరో అపురూప ఘట్టం చోటుచేసుకుంది. భట్టి విక్రమార్క తన పాదయాత్ర సమయంలో తనకు తోడుగా నిలిచిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారికి వివాహ వేదికపై ప్రత్యేక గౌరవం కల్పించి తన కృతజ్ఞతను చాటుకున్నారు.

గత ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పాదయాత్రలో వీరంతా పాలుపంచుకున్నారు. ముఖ్యంగా జైనూర్ మండలం బూసిమెట్టకు చెందిన వాలే లక్ష్మీబాయి, డాకూర్ రుక్మబాయి, దుర్గ సిందు, ఉట్నూరు మండలం దేవగూడకు చెందిన మరప గంగుబాయి, సుమన్ బాయి, సీడం లక్ష్మీబాయి.. వీరంతా పాదయాత్రలో భాగస్వాములయ్యారు. ఎండ తీవ్రతకు భట్టి అలసిపోకుండా, ఆయన ఆరోగ్యం దెబ్బతినకుండా తమ సంప్రదాయ ఆదివాసీ పానీయాలను అందించి ఆత్మీయతను చాటుకున్నారు. పదవులు వచ్చినా పాత మిత్రులను మరవకుండా తన కృతజ్ఞతను చాటుకున్నారు భట్టి.

