- కార్పొరేషన్ల ఎన్నికల వేళ మిన్నంటిన చవితి జోరు
- హైదరాబాద్ సహా కార్పొరేషన్లలో అడిగిందే తడవు విరాళాలు
- భారీ విగ్రహాలతో ఏర్పాట్లు.. నిమజ్జన వేడుకను మించి ‘ఆగమన్’ ర్యాలీలు
- ఓటర్ల ప్రసన్నమే ధ్యేయంగా ఆశావహుల ప్రచార వ్యూహాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (తెలుగుప్రభ): రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలకు ఈసారి రాజకీయ రంగు మరింత దట్టంగా అలుముకుంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు త్వరలో ఎన్నికలు జరగాల్సిన ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గణపతి నవరాత్రులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా టికెట్లు ఆశిస్తున్న అన్ని పార్టీల ఆశావహులు, స్థానిక నాయకులు గణేశ్ మండపాలను తమ ప్రచార వేదికలుగా మార్చుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా అడిగిందే తడవు భారీ మొత్తంలో విరాళాలు సమర్పించుకుంటున్నారు. మేమున్నాం.. మీరు బిందాస్‌గా ఉండండంటూ మరింత మొత్తం ఇస్తామని మండపాల నిర్వాహకులకు భరోసా ఇస్తున్నారు. భారీ విగ్రహాలు, వాటికి ముంబై తరహాలో వెల్కమ్ చెప్పందుకు ఆగమన్ కార్యక్రమాలకు గాను డిజిటల్ హంగులు, డీజేలు జోడించి లక్షలు వెచ్చిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ఇలాంటి వేడుకలు గల్లీగల్లీలో కనిపిస్తున్నాయి. ఆకాశంలో మిరుమిట్లు గొలిపే టపాసుల మోతలు ఈ వేడుకలకు మరింత వన్నె తెచ్చాయి. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్న నాయకులు వందలాది మంది అనుచరులతో ర్యాలీలు నిర్వహించి వార్డుల్లో తమ పట్టును చాటుకునే ప్రయత్నం చేశారు.
ఫ్లెక్సీల యుద్ధం
మండపం చుట్టూ, పరిసరాల్లో ఆశావహులు, వారి అధిష్టాన పెద్దల భారీ కటౌట్లు, ఫ్లెక్సీలే దర్శనమిస్తుండటం ఈ పండుగ విశేషంగా చెప్పుకోవాలి. కాలనీల్లో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రతి చిన్న సందులోనూ, చిన్నపాటి ఫ్లెక్సీల యుద్ధమే నడుస్తోంది. మండపానికి వెళ్లి పూజలు చేయడం, స్థానిక పెద్దలను శాలువాలతో సత్కరించడం, ఆ దృశ్యాలను రీల్స్, లైవ్‌ల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా ఓటర్లకు చేరువవ్వాలని నాయకులు ప్రణాళికలు వేసుకుంటున్నారు.
ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే
ముంబై తర్వాత అత్యంత ఘనంగా వినాయకుడి వేడుకలు నిర్వహించే గ్రేటర్ హైదరాబాద్‌లో ఈసారి మరింత విశేషంగా కనిపిస్తున్నది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో మూడు కార్పొరేషన్లు అయిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మేడ్చల్-మల్కాజిగిరి కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడు కార్పొరేషన్లపై జెండా ఎగురవేయాలని, తమ బలం నిరూపించుకోవాలని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు యథాశక్తి కసరత్తు చేస్తున్నాయి. వీటిని కైవసం చేసుకుంటే రాష్ట్రంలో అధికారం ఖాయమన్న భావనతో ఉన్నాయి. అందుకే.. రెండు నెలల క్రితం నగరంలో జరిగిన బోనాల జాతరలో నాయకులు తమ ప్రభావమేపాటిదో నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వినాయక ఉత్సవాలతో పాటు రానున్న దేవీ నవరాత్రులను సంపూర్ణంగా వినియోగించుకుని ప్రజలకు దగ్గరయ్యేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఒకరి వెంట మరొకరు
సాధారణంగా వినాయకుడిని ప్రతిష్టించే ఏ మండపమైనా గతంలో ఒక పార్టీ నేత కనుసన్నల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని పార్టీల నాయకులకు ప్రతిమండపం వేదికగా మారుతున్నది. ఒక పార్టీ నేత మండపానికి వెళ్తే.. వెంటనే మరో పార్టీ నేత కూడా అక్కడ ప్రత్యక్షమయ్యే పరిస్థితులు ఉత్పన్నం కానున్నట్టు వసూలైన విరాళాల వివరాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు మండపాల నిర్వాహకులకు కూడా నేతల నుంచి ప్రత్యేక ప్రాధాన్యత దక్కి వారు నాయకులుగా ప్రమోటయ్యే అవకాశం ఉన్నది. ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి నాయకులు మాత్రమే కాకుండా.. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు ఇప్పుడు మండపాల వద్ద చురుగ్గా కనిపిస్తున్నారు.
ఒక్కో మండపం ఒక్కో పోలింగ్ బూత్ లెక్క
వినాయక మండపం అంటే ఒక్క విగ్రహం మాత్రమే కాదు. చుట్టుపక్కల కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు, వ్యాపార వర్గాలు, యువత, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఒకచోట చేరే వేదిక. ఇదే ఇప్పుడు రాజకీయ నేతలకు పోలింగ్ బూత్‌లా కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇంటింటికీ వెళ్లి పరిచయం చేసుకోవడానికి ముందు ఒక మండపం వద్దకు వెళ్లి వందల మందిని పలకరించడం కలిసివచ్చిన అవకాశం. దీంతో స్థానిక నాయకులు మండపాల నిర్వాహకులతో టచ్‌లోకి వస్తున్నారు. అందుకే ఈసారి వినాయక మండపాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. రాజకీయ పల్స్‌ను తెలుసుకునే వేదికలుగా మారాయన్నది సత్యం.

