Harish Rao and KTR Comments: తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టును వంద శాతం రద్దు చేస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ప్రకటించారు. అమెరికా పర్యటనలో ఉన్న హరీశ్ రావు.. శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Also Read: https://teluguprabha.net/national-news/rajya-sabha-elections-24-seats-june-18-schedule/
రియల్ ఎస్టేట్ వ్యాపారం: రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేసి, బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిపాదించిన ‘ఫార్మా సిటీ’ ప్రాజెక్టును మళ్లీ యథావిధిగా తీసుకొస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఫ్యూచర్ సిటీ కేవలం ఒక “రియల్ ఎస్టేట్ వ్యాపారం” లాంటిదని విమర్శించారు. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం.. సేకరించిన భూమిని ఏ అవసరం కోసం అయితే తీసుకున్నారో, దానికి కాకుండా వేరే దానికి ఉపయోగిస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు.
రాజకీయ దుమారం: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీపై హరీశ్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. మరోవైపు ఈ రోజు తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేటీఆర్ ఫైర్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. దీనిపై కేవలం రైతులు మాత్రమే కాకుండా స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ధర్నాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ వ్యవసాయ సంక్షోభంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముడుపోక అన్నదాతలు రోడ్డెక్కారని.. రాష్ట్రంలో నిరసనలు, ధర్నాలు రోజువారీగా మారాయని మండిపడ్డారు. రైతుల కష్టాలు చూడలేక స్వయంగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ధర్నాలకు దిగుతున్నారన్నారు. సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం, కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో పలువురు రైతులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

